యామిని కామెంట్లపై జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా యామినిని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైకాపా ఇచ్చిన షాక్ నుంచి టీడీపీ నేతలు ఇంకా తేరుకోలేనట్లు మనకు కనిపిస్తోంది. ఆ పార్టీ నేతలే కాదు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులు కూడా వైకాపాపై, సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌పై దుర్భాషలాడారు. సీఎం అయిన వ్యక్తిని పట్టుకుని వాడు, వీడు అంటూ సంబోధన చేశారు. దీంతో యామినిపై ఇప్పుడు వైకాపా నేతలు, కార్యకర్తలు, జగన్ అభిమానులు మండిపడుతున్నారు.
నిన్న ప్రధాని మోదీ తిరుపతికి వచ్చిన సందర్భంగా ఆయన్ను ఆహ్వానించేందుకు సీఎం జగన్, గవర్నర్ నరసింహన్, పలువురు మంత్రులు విమానాశ్రయానికి వెళ్లారు. అయితే మోదీని ఆహ్వానించే సందర్భంలో జగన్ ఆయన కాళ్లకు నమస్కారం చేసేందుకు యత్నించగా.. మోదీ వద్దని వారించారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అదే వీడియోపై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని దుర్భాషలాడారు. ఈ మేరకు ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
యామిని తన ఫేస్‌బుక్ పోస్టులో ‘తిరుపతి పర్యటన లో భాగంగా విచ్చేసిన ప్రధాని మోడీ కాళ్ళు పట్టుకునేందుకు లైన్లో నిలబడి మరీ వెంపర్లాడిన మా పులివెందుల పులి.. వీడా మోడీ మెడలు వంచి మనకు హోదా, రైల్వే జోన్ తెచ్చేది’అంటూ కామెంట్ చేసింది. దీంతో యామిని కామెంట్లపై జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా యామినిని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు.
యామిని నోరు అదుపులో పెట్టుకోవాలని, ఆడదానివని ఊరుకుంటున్నాం లేకపోతే చెప్పుతో కొట్టేవారమని, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని.. ఇలా వైకాపా కార్యకర్తలు రక రకాలుగా స్పందిస్తున్నారు. అయితే మరోవైపు ఆ పోస్టు యామిని అఫిషియల్ అకౌంట్‌లో పెట్టింది కాదు. ఆమెకు ఫేస్‌బుక్‌లో అఫిషియల్ అకౌంట్ ఇంకొకటి ఉంది. కానీ ఆ పోస్టు పెట్టిన అకౌంట్‌ను కూడా అఫిషియల్‌గానే నడిపిస్తున్నారు. మరి దీనిపై వైకాపా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, అటు యామిని ఎలా స్పందిస్తారో.. వేచి చూస్తే తెలుస్తుంది..!