రోజా అసంతృప్తితో ఉన్నారని తెలుసుకున్న జగన్ ఆమెకు నామినేటెడ్ పదవుల్లో అత్యంత కీలకం అయిన ఆర్‌టీసీ చైర్‌పర్సన్ పదవిని ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన మంత్రివర్గాన్ని ప్రకటించగా.. అందులో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారికి సమాన ప్రాధాన్యాన్ని ఇచ్చారు. జగన్ కేబినెట్‌పై రెడ్ల ముద్ర పడకుండా ఉండడానికి ఆయన తన కేబినెట్‌లో అన్ని వర్గాలకు చెందిన వారికి అవకాశం కల్పించారు. అంతేకాదు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి అత్యంత కీలకమైన పదవులను ఇచ్చారు. అయితే మరోవైపు.. మొదట్నుంచీ జగన్ వెన్నంటి ఉన్న రోజాకు మాత్రం ముందుగా భావిస్తున్నట్లుగా హోం శాఖ కాదు కదా.. కనీసం వేరే ఏ మంత్రి పదవి అయినా సరే ఇవ్వలేదు. దీంతో రోజా ప్రస్తుతం అలిగారని తెలిసింది.
అయితే రోజా అసంతృప్తితో ఉన్నారని తెలుసుకున్న జగన్ ఆమెకు నామినేటెడ్ పదవుల్లో అత్యంత కీలకం అయిన ఆర్‌టీసీ చైర్‌పర్సన్ పదవిని ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఏపీలో ఉన్న కీలకమైన నామినేటెడ్ పదవుల్లో టీటీడీ చైర్మన్ పదవి తరువాత ముఖ్యమైన పదవి ఆర్‌టీసీ చైర్‌పర్సన్ పదవి కావడం విశేషం. కాగా ఈ పోస్టులో రోజాను నియమిస్తారని తెలుస్తోంది. రోజూ లక్షలాది మంది ప్రయాణికులు, ఉద్యోగులు, కార్మికులతో టచ్‌లో ఉండే పదవి అది. దాని బాధ్యతలను చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ముక్కు సూటితనంతో వెళ్లే రోజాకు ఆర్‌టీసీ చైర్‌పర్సన్ పదవి ఇస్తే ఆమె చక్కగా పనిచేస్తారని, నష్టాలలో ఉన్న ఆర్‌టీసీని లాభాల పట్టిస్తారని, అందుకే ఆ పదవిని రోజాకు జగన్ ఇస్తారని కూడా తెలుస్తోంది.
ఒక వేళ సీఎం జగన్ నిజంగానే ఏపీఎస్ ఆర్‌టీసీ చైర్‌పర్సన్ పదవిని రోజాకు గనుక ఇచ్చినట్లయితే ఆ పదవిలో నియమితురాలైన రెండో మహిళగా రోజా రికార్డులకెక్కుతారు. అప్పట్లో ఉమ్మడి ఏపీలో సీఎం చంద్రబాబు దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డిని ఆర్‌టీసీ చైర్ పర్సన్‌గా నియమించారు. అయితే ఇప్పుడున్నది విభజించబడిన ఆంధ్రప్రదేశ్ కనుక ఇప్పుడు రోజా ఆ పదవిలోకి వస్తే.. ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా రోజా రికార్డు సృష్టిస్తారు. అయితే రోజా ఈ పదవిని ఇస్తే స్వీకరిస్తారా.. లేక జగన్ ఈ పదవిని ఆమెకు ఇస్తారా.. అన్న వివరాల్లో ఇప్పుడు కొంత సందిగ్ధత నెలకొంది. మరికొద్ది రోజులు వేచి చూస్తే గానీ ఈ అంశంలో స్పష్టత రాదు.