తెలంగాణ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల్లో గెలిచి మళ్ళీ హ్యాట్రిక్ కొట్టడానికి కేసిఆర్ రెడీ అయ్యారుయి. ఇప్పటికే బిఆర్ఎస్ అభ్యర్ధుల జాబితా విడుదల చేసి నేతలని, కార్యకర్తలని ఎన్నికలకు సిద్ధం చేశారు. కాకపోతే అభ్యర్థుల జాబితా విడుదల అయిన దగ్గర నుంచి ఆశావాహుల నుండి నిరసనలు వస్తూనే ఉన్నాయి.
ఇదే క్రమంలో నాగార్జునసాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ ఉన్నారు. ఈసారి కూడా అతనికే టికెట్ ఇవ్వడంతో పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారు. తండ్రి మరణంతో గెలిచిన భగత్ పార్టీ కార్యకర్తలను, తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని, తన మాట వినని అధికారులు బదిలీ చేస్తున్నారని, తన సామాజిక వర్గం వరకే పెద్దపీట వేస్తున్నారని క్యాడర్ నుండి వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేయకపోవడం, నెల్లికల్ల లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం ఆపడం, గ్రామాలలో మౌలిక వసతుల కల్పన చేయకపోవడం ఇవన్నీ భగత్ ను నియోజకవర్గ ప్రజలకు దూరం చేశాయని చెప్పవచ్చు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎస్టీ లంబాడీల ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. వారంతా నోములపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. నోముల స్థానికుడు కాదని, స్థానికంగా బలంగా ఉన్న ఎమ్మెల్సీ ఎమ్ సి కోటిరెడ్డి వర్గం భగత్ కు టికెట్ ఇవ్వడంపై గుర్రుగా ఉన్నారు. ఆయన టికెట్ క్యాన్సిల్ చేయాలని అంటున్నారు. మళ్ళీ భగత్‌ని నిలబెడితే తామే ఓడిస్తామని అన్నట్లుగా ఉన్నారు.
బిఆర్ఎస్ లో ఉన్న వర్గ పోరును తనకి అనుకూలంగా మార్చుకొని కాంగ్రెస్ ఈసారి అధికారంలోకి రావాలని చూస్తోంది. సాగర్ కాంగ్రెస్ సీటు జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డికి ఫిక్స్ అనే చెప్పవచ్చు. తండ్రి ఇమేజ్, కాంగ్రెస్ బలం, బిఆర్‌ఎస్ లో గ్రూపు గొడవలు..జైవీర్‌కి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ సారి సాగర్ ఎవరి వశం అవుతుందో.