విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు విపక్షాలు సిద్ధం అవుతున్నాయి. టీడీపీ మరియు జనసేన దశలవారీగా పోరుకు సిద్ధం అవుతున్నాయి. ఇదే సందర్భంలో వైసీపీ తరఫున వాదన వేరుగా ఉంది. తాము పెంచిన పెంపు స్వల్పమేనని అయినా కూడా చంద్రబాబు మీడియా అదే పనిగా నానా యాగీ చేస్తోందని పెదవి విరుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దగా పేరున్న సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా ముందుకు వచ్చి అనేక వాస్తవాలు వివరించేందుకు పలు గణాంకాలతో సోదాహరణంగా చెప్పేందుకు ప్రయత్నించారు.
ఆయనేమన్నాంటే…?
ఆకాశం మీద ఉమ్మేయొద్దు..!
చంద్రబాబు తన హయాంలో రూ.90 వేల కోట్లు ఉన్న అప్పులను దాదాపు రూ.4 లక్షల కోట్లకు పెంచారు. అయినా ఒక్క సంక్షేమ పథకం చెప్పుకోవడానికి లేదు. మహా అయితే చంద్రన్నకానుక అంటారు. కానీ అందులో ఇచ్చిన ప్రతి వస్తువు సేకరణలో కమిషన్ల వ్యవహారం. అది అందరికీ తెలిసిందే. ఇవాళ ఈనాడులో మరో స్టోరీ రాశారు. జగన్‌గారి ఫోటో కోసం కోట్లు ఖర్చు చేశారని. కానీ పిల్లల ఆరోగ్యం కోసం, ఆ ఆహారం పరిశుభ్రంగా ఉండేలా, రేపర్ల కోసం ప్రభుత్వం ఆ పని చేసింది.
కానీ మీరేం చేశారు. జయము జయము చంద్రన్న అన్న భజన కోసం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేశారు. దీక్షల పేరుతో వందల కోట్లు ఖర్చు చేశారు.ఆ 5 ఏళ్ల చంద్రబాబు పాలన బాధ్యతా రాహిత్యంగా సాగితే, అందుకు పూర్తి భిన్నంగా ఈ ప్రభుత్వం పని చేస్తోంది. ఆకాశం మీద ఉమ్మేస్తే, మొహం మీద పడుతుంది. ఇక బీజేపీ నేతలకు చెబుతున్నాం. మీకు ధైర్యముంటే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించమని కోరండి..అంటూ వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఫైర్ అయ్యారు.