ఉగాది తో గవర్నర్‌, సీఎం మధ్య దూరం తొలగేనా?.. 

-

  • గవర్నర్‌, సీఎం మధ్య దూరం తొలగేనా?..
  • ఉత్సవానికి కేసీఆర్‌ను ఆహ్వానించిన తమిళిసై
  • 1న రాజ్‌భవన్‌లో, మర్నాడు ప్రగతిభవన్‌లో.. 
  • సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి

 

 

 

 

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ల మధ్య కొత్త సంవత్సరం ‘శుభకృత్‌’తో నైనా మళ్లీ స్నేహం చిగురిస్తుందా? పొరపొచ్చాలు, భేదభావాలను దూరం పెట్టి మైత్రి బంధాన్ని కొనసాగిస్తారా? అన్న చర్చ ప్రారంభమైంది. ఏ చిన్న సందర్భం వచ్చినా ఇరువురి మధ్య పెరిగిన దూరంపైనే చర్చలు సాగుతున్నాయి. ఉగాది వేడుక అయినా ఇరువురి మధ్య వారధి కడుతుందా అన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఉగాది ఉత్సవాలకు రావాలంటూ రాష్ట్ర గవర్నర్‌ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. రాజ్‌భవన్‌లో ఈ నెల 1న సాయంత్రం నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొనాలంటూ ప్రగతి భవన్‌కు ఆహ్వానం పంపారు. కనీసం ఈ కారణంతోనైనా సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌లో అడుగు పెడతారా లేదా అన్న సందేహాలున్నాయి. ఈఎ్‌సఎల్‌ నర్సింహన్‌ స్థానంలో 2019 సెప్టెంబర్‌లో తమిళిసై సౌందరరాజన్‌ను రాష్ట్ర గవర్నర్‌గా రాష్ట్రపతి నియమించారు. కేసీఆర్‌కు, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మధ్య మొదట్లో ఎలాంటి విభేదాలు ఉండేవి కావు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమాలకు సీఎం హాజరయ్యే వారు. కాంగ్రెస్‌ నుంచి వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ సీఎంవో పంపిన పంపిన ఫైలును గవర్నర్‌ పక్కన పెట్టడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి గవర్నర్‌, సీఎం దూరం దూరంగానే ఉంటున్నారు. జనవరి 26న రాజ్‌భవన్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు సీఎం, ఆయన మంత్రివర్గ సహచరులు హాజరు కాలేదు. గవర్నర్‌ గణతంత్ర దినాన ప్రభుత్వ ప్రసంగ కాపీని పక్కన పెట్టి తన సొంత ప్రసంగాన్ని చదివారంటూ ప్రభుత్వ వర్గాలు ఆరోపించాయి. తర్వాత సమ్మక్క- సారలమ్మ జాతరకు వెళ్లిన గవర్నర్‌కు ప్రభుత్వ అధికారులు ప్రొటోకాల్‌ పాటించకపోవడం చర్చనీయాంశమైంది. గవర్నర్‌ను ఆహ్వానించడానికి జిల్లా మంత్రి, కలెక్టర్‌ వెళ్లకుండా ప్రభుత్వమే అడ్డుకుందన్న ఆరోపణలు వెలువడ్డాయి. బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని చెంచు గూడేల్లో గవర్నర్‌ చేపట్టిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(టీఆర్‌ఎస్‌) హాజరు కాలేదు. ఇలాంటి వరుస ఉదంతాలున్నప్పటికీ గవర్నరే స్నేహహస్తం చాటారు. ఏప్రిల్‌ 1న సాయంత్రం 7 గంటలకు రాజ్‌భవన్‌లో ‘శుభకృత్‌’ ఉగాది ఉత్సవాన్ని నిర్వహించతలపెట్టారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వాన పత్రాన్ని పంపించారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. ఇటీవల గవర్నర్‌ ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ‘‘సీఎం నా ఆహ్వానాన్ని స్వీకరిస్తారని భావిస్తున్నా.. కొత్త సంవత్సరంలో కొత్త ఆరంభాన్ని ఆకాంక్షిద్దాం. సీఎం చాలాకాలంగా రాజ్‌భవన్‌కు రావడం లేదు. గ్యాప్‌కు నా వైపు నుంచి ఎలాంటి కారణాలు లేవు. విభేదాలన్నీ కనుమరుగు కావాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు. కనీసం ఇప్పుడైనా సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌లో అడుగు పెడతారా అన్న చర్చ సాగుతోంది. గవర్నర్‌తో ఎలాంటి విభేదాలున్నా.. గవర్నర్‌ పదవికైనా విలువ ఇచ్చి వెళతారేమోనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కీలకమైన రెండు పదవుల మధ్య ఇలాంటి సంక్షోభం ఏర్పడడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని ఓ పరిశీలకుడు వ్యాఖ్యానించారు. ఉగాది రోజు ఏప్రిల్‌ 2న ప్రగతిభవన్‌లోని జనహితలో శుభకృత్‌ ఉగాది ఉత్సవాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నిర్ణయించింది. గవర్నర్‌ కార్యక్రమం ముందురోజు సాయంత్రం ఉన్నందున వ్యవధి లేదనే కారణమూ పొసగదు. ఈ నేపథ్యంలో ఒకటిన సీఎం రాజ్‌భవన్‌కు వెళతారా లేదా అన్నది చర్చనీయంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news