సత్యవేడు నియోజకవర్గం…..ఎప్పుడూ కీలకమే

-

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గoలో ఎప్పుడూ రాజకీయ పార్టీలకు ఆదరణ ఉంటూనే ఉంది.ఒక ఉప ఎన్నిక సహా ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరగ్గా కేవలం ఒక్కసారి మాత్రమే స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకున్నారు ఇక్కడి ఓటర్లు.అది మినహా ఏదో ఒక రాజకీయ పార్టీని ఆదరిస్తునే ఉన్నారు.1962 నుంచి ఎన్నికల్లో ఆరుసార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తే.. ఐదుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు,ఒకసారి స్వతంత్ర అభ్యర్థి,ఒకసారి వైసీపీ అభ్యర్థు విజయం సాధించారు.ఇక్కడ 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కె.ఆదిమూలం మెజార్టీ విజయం సాధించి రికార్డు సృష్టించారు.

ఇక తొలిసారి 1962లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి టి.బాలకృష్ణయ్య స్వతంత్ర అభ్యర్థి కె.మునిస్వామిపై 251 ఓట్ల తేడాతో విజయం సాధించారు.అప్పట్లో మద్రాసు ప్రెసిడెన్సీ మొత్తం మీద ఇక్కడే అతితక్కువ మెజారిటీ నమోదు అయింది. 1967లో అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థి కటారి మునిస్వామి కాంగ్రెస్ అభ్యర్థి టి.బాలకృష్ణయ్యపై విజయం సాధించారు. ఇక 1972లో కాంగ్రెస్ తరఫున సి.దాస్ బరిలో నిలవగా డీఎంకే పార్టీ అభ్యర్థి శిఖామణిపై 19,732 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ తర్వాత, 1978లో జనతా పార్టీ అభ్యర్థి వై.గంగాధరంపై కాంగ్రెస్ అభ్యర్థి సి.దాస్ విజయం సాధించారు.

అయితే, 1983లో టీడీపీ అభ్యర్థి తలారి మనోహర్ కాంగ్రెస్ అభ్యర్థి సి.దాస్ హ్యాట్రిక్ గెలుపుకి బ్రేక్ వేశారు. 1985లో జరిగిన ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ఎమ్.సురాజన్.. కాంగ్రెస్ అభ్యర్థి వై.రామారావుపై గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి సి.దాస్.. టీడీపీ అభ్యర్థి తలారి మనోహర్ పై 15,668 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక, 1994లో టీడీపీ తరఫున పోటీ చేసిన ఎమ్.సురాజన్.. కాంగ్రెస్ అభ్యర్థి కె.నారాయణ స్వామిపై 29,005 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1999లోనూ టీడీపీ అభ్యర్థి ఎన్.శివప్రసాద్ కాంగ్రెస్ అభ్యర్థి కె.నారాయణ స్వామిపై 6,659 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కె.నారాయణ స్వామి టీడీపీ అభ్యర్థి ఎన్.శివప్రసాద్ పై 31,492 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి హేమలత కాంగ్రెస్ అభ్యర్థి కె.నారాయణ స్వామిపై 9,691 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య వైసీపీ అభ్యర్థి కె.ఆదిమూలంపై గెలిచారు.2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నిలబడిన కె.ఆదిమూలం టీడీపీ అభ్యర్థి జె.డి.రాజశేఖర్ పై 44,744 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు.

ఇప్పటివరకు సత్యవేడుకి జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజారిటీ.కొన్ని అనివార్య కారణాల వలన ఆదిమూలంని వైసీపీ అధిష్టానం పక్కన పెట్టేసింది. ఆయన స్థానంలో నూకతోటి రాజేష్ ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. గత ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజారిటీ ఇచ్చిన ఓటర్లు ఈసారి కూడా ఫ్యాన్ కి అండగా ఉంటారని రాజేష్ భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news