భూమి గుండ్రంగా ఉందన్నట్లు మొత్తానికి సీనియర్ నేత డి శ్రీనివాస్ తిరిగి తిరిగి మళ్ళీ కాంగ్రెస్‌లోకే వస్తున్నారు. అసలు డీఎస్ అంటే కాంగ్రెస్…కాంగ్రెస్ అంటే డీఎస్ ఇది తెలంగాణ రాకముందు వరకు పరిస్తితి. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం డి శ్రీనివాస్ ఎలా పనిచేశారో అందరికీ తెలిసిందే. అలాగే ఉమ్మడి ఏపీలో పిసిసి అధ్యక్షుడుగా పనిచేసి, కాంగ్రెస్ పార్టీని అధికార పీఠంలోకి తీసుకురావడంలో కృషి చేశారు. 1999లో చంద్రబాబు అద్భుత మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చాక మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమే అని అంతా అనుకున్నారు.
కానీ ఓ వైపు వైఎస్సార్..మరోవైపు డీఎస్‌లు టీడీపీ హవాని తట్టుకుని నిలబడి కాంగ్రెస్‌ని నిలబెట్టారు. అలాగే కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత పోరుని సెట్ చేసి…అందరు నాయకులని ఏకతాటిపైకి తీసుకొచ్చి 2004లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవడానికి కారణమయ్యారు. ఇలా కాంగ్రెస్‌ని గెలిపించిన అనుభవం ఉన్న డీఎస్…తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్‌లోకి వెళ్ళిన విషయం తెలిసిందే. అక్కడ రాజ్యసభ కూడా తీసుకున్నారు. కానీ అక్కడ ఎక్కువకాలం ఉండలేకపోయారు. పైగా తన తనయుడు అరవింద్ బీజేపీ ఎంపీగా గెలవడం, పైగా కవితపైనే గెలవడంతో టీఆర్ఎస్ శ్రేణులు..డీఎస్‌ని దూరం పెట్టాయి. డీఎస్ కూడా టీఆర్ఎస్‌కు దూరం జరిగారు. ఇక ఇప్పుడు ఆయన మళ్ళీ సొంతగూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే వయసు మీద పడిన డీఎస్ వల్ల ఉపయోగం ఏంటి? అనే ప్రశ్నలు వస్తున్నాయి. వయసు కాదు అనుభవాన్ని చూడాలని రేవంత్ రెడ్డి అంటున్నారు.
అయితే డీఎస్ అనుభవాన్ని వాడుకుంటూ, సలహాలు తీసుకోవడమేనా లేక ఆయనకు సీటు కూడా ఇస్తారా?అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో వస్తున్న ప్రశ్న. గతంలో కాంగ్రెస్ నుంచి ఆయన నిజామాబాద్ అర్బన్ నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరి నెక్స్ట్ ఈ రెండు సీట్లలో ఒకటి ఇస్తారా? లేక ఆయన తనయుడు సంజయ్‌కు సీటు ఇస్తారా?అనేది తెలియాల్సి ఉంది. మరి చూడాలి కాంగ్రెస్‌లో డీఎస్ పొజిషన్ ఎలా ఉంటుందో.