విప్లవాల గడ్డ శ్రీకాకుళం జిల్లా, బొడ్డపాడులో భూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడి విలువైన భూములను ఎటువంటి పరిహారం చెల్లించకుండానే లాక్కునేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. అడ్డు వస్తే చాలు క్రిమినల్ కేసులు సైతం రైతులపై నమోదు చేస్తున్నారు కూడా ! దీంతో ఇక్కడ వివాదం ఎప్పటికప్పుడు రాజుకుంటూనే ఉంది. పోలీసులకూ రైతులకూ మధ్య ఘర్షణాత్మక వైఖరి నెలకొని ఉంది.
కోట్ల విలువ చేసే భూములు ఇంత కాలం రైతులు సాగుకు యోగ్యమైన భూములు తమ నుంచి ఎటువంటి పరిహారం లేకుండానే లాక్కోవాలని చూస్తున్నారని రైతులంతా ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి ఇవన్నీ డీ పట్టా భూములు అయినప్పటికీ జగనన్న టౌన్ షిప్ కోసమో లేదా మరే ఇతర అవసరాల కోసమో భూమి సేకరిస్తున్నప్పుడు తమకు పరిహారం చెల్లించకుండా లాక్కోవాలని రెవెన్యూ యంత్రాంగం ఆరాటపడుతోంది.
ప్రధాన మీడియాలో వెలుగుచూసిన కథనం ప్రకారం.. ఇప్పటికే జగనన్న టౌన్ షిప్ కోసం 150 ఎకరాల వరకూ భూమిని సేకరించారు. రైతులు పట్టుబట్టడంతోనే వీరికి పరిహారం చెల్లించారు. కానీ ఇదే టౌన్ షిప్ కు అనుకుని ఇంకా చెప్పాలంటే నేషనల్ హైవే కు ఆనుకుని ఉన్న 14 ఎకరాలను రెవెన్యూ యంత్రాంగం లాక్కోవాలని చూస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా హైవేకు ఆనుకుని ఉన్న భూమిని అంటే 5.50 ఎకరాల భూమిని ఎటువంటి పరిహారం లేకుండానే లాక్కొనేందుకు యోచిస్తున్నారు.