పవన్ మిత్రులది నమ్మకద్రోహమా – వ్యూహాత్మకమా?

సినిమా టిక్కెట్లను ప్రభుత్వమే అమ్ముతుందనే అంశంపై తనదైన శైలిలో పవన్ మాట్లాడారు. జగన్ సర్కార్ పై తన అక్కసు తీర్చుకునేపనికి పూనుకున్నారు. ఆయన ఎంచుకున్న పాయింట్ కరెక్టా కాదా అనే అంశంకంటే ఎక్కువగా… ఆయన ఎంచుకున్న వేదిక సరైంది కాదనే కామెంట్లు బలంగా వినిపించాయి. ఆ సంగతి అలా ఉంటే… ఈ మొత్తం ఎపీసోడ్ లో అటు సినిమా ఇండస్ట్రీ పరంగా ఇప్పటికే దాదాపు ఒంటరైపోగా.. ఇప్పుడు రాజకీయంగా కూడా ఒంటరైపోయారు!

pawan kalyan
pawan kalyan

తెరవెనుక ఉద్దేశ్యాల సంగతి కాసేపు పక్కనపెడితే… జగన్ సర్కార్ కి అనుకూలంగా అటు మంత్రులు – ఇటు పోసాని లాంటి జగన్ సానుభూతిపరులు మైకులందుకున్నారు – పవన్ ను ఏకిపారేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే… చాకిరేవు పెట్టేశారు! అయితే ఈ విషయంలో ఇప్పటివరకూ అటు బీజేపీ నేతలు కానీ, ఇటు టీడీపీ నేతలు కానీ పవన్ కు మద్దతుగా మైకుపట్టుకున్న పాపానపోలేదు!

అధికారికంగా మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నేతలు కూడా… పవన్ కు మద్దతుగా ఒక్కముక్క మాట్లాడలేదు. ఇదే సమయంలో అనధికార మిత్రపక్షం అనే పేరుసంపాదించుకున్న టీడీపీ నుంచి కూడా… పవన్ కు అనుకూలంగా – జగన్ టీం కి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా వినిపించలేదు. దీంతో… పవన్ ఒంటరైపోయారా – లేక వ్యూహాత్మకంగానే మిత్రులను సైలంట్ చేశారా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఎందుకంటే… ఏపీలో జగన్ సర్కార్ సినిమా టిక్కెట్లపై నిర్ణయం తీసుకున్నవెంటనే… టీడీపీ నేతలు మైకులముందుకు వచ్చారు. నోటికొచ్చిన విమర్శలన్నీ చేశారు. అయితే… దాదాపు అవే విమర్శలు పవన్ చేస్తుంటే మాత్రం… మద్దతు ఇవ్వడం లేదు! అంటే… పవన్ అవసరం తమకు లేదని టీడీపీ నేతలు భావిస్తున్నారా లేక… సినిమా ఇండస్ట్రీ వర్గాలతో మాంచి సంబందాలున్న టీడీపీ నేతలు వ్యూహాత్మకంగానే మౌనం పాటించారా అన్నది ఆసక్తికరంగా మారింది.