సూర్యాపేట నియోజకవర్గం అంటే ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. మధ్యలో టిడిపి కొన్ని విజయాలు అందుకున్న..మళ్ళీ టిడిపికి చెక్ పెట్టి 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచింది. కానీ 2014, 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి జగదీష్ రెడ్డి గెలిచి సత్తా చాటారు. మంత్రిగా ఆయన తిరుగులేని స్థానంలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ బిఆర్‌ఎస్ నుంచి పోటీకి రెడీ అయ్యారు.
అయితే ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ఏ నియోజకవర్గం ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారా అని నేతలతో పాటు ఓటర్లు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూర్యాపేట నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు నాయకులు టికెట్ ఆశిస్తున్నారు. వారు కాంగ్రెస్ సీనియర్ నేత రాం రెడ్డి దామోదర్ రెడ్డి ఒకరు, పటేల్ రమేష్ రెడ్డి ఒకరు.
మాజీ మంత్రి సీనియర్ నేత దామోదర్ రెడ్డి పై రేవంత్ రెడ్డికి ఎటువంటి వ్యతిరేకత లేకున్నా, పటేల్ రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కావడం వలన, తన సన్నిహితుడైన పటేల్ రమేష్ రెడ్డికి సూర్యాపేట కాంగ్రెస్ స్థానాన్ని ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు.
అయితే ఇక్కడ సీటు ఎవరికి దక్కుతుందో చెప్పలేం. కానీ సీటు ఎవరికి దక్కినా..ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తేనే కాంగ్రెస్ గెలుస్తుంది. లేదంటే జగదీష్ హ్యాట్రిక్ ఫిక్స్. చూడాలి మరి సూర్యాపేటలో ఈ సారి ఎవరు పైచేయి సాధిస్తారో.