సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఫలితాలన్నీ తేడా కొడుతున్నాయి. ఇప్పుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఎప్పటికప్పుడు పర్యటనలు చేస్తే కానీ అనుకూల ఫలితాలు వస్తాయో రావో అన్న సంశయం ఒకటి వెన్నాడుతోంది. ఇవాళ టీడీపీ బాస్ తన సొంత నియోజకవర్గంలో పర్యటించి శ్రేణులను ఉత్సాహ పరిచారు. స్థానిక ఎన్నికల్లో చేదు ఫలితాలు రావడంతో, సొంత నియోజకవర్గంలో వైసీపీ జెండాలు రెపరెపలాడుతూ కళకళలు సంతరించుకోవడంతో టీడీపీ డైలమాలో పడిపోయింది.
దీంతో వ్యూహం మార్చి ఎప్పటికప్పుడు సొంత జిల్లా సొంత నియోజకవర్గం పై దృష్టి నిలపడంతో పాటు కార్యకర్తలను నేరుగా కలుసుకుని, వారి సమస్యలు తెలుసుకుని ఆసరాగా ఉండడం కూడా ఇప్పుడు టీడీపీ విధిగా చేస్తున్న పని. ఇవాళ నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు అక్కడే మకాం వేసి కార్యకర్తలతో మమేకం అవుతూ బాదుడే బాదుడు పేరుతో పలు నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ వైఫల్యాలను వినిపించనున్నారు.
ఇక ఒక్క చిత్తూరు అనే కాదు సీమ జిల్లాలలో ఒకప్పటిలా చంద్రబాబు మాట అస్సలు చెల్లడం లేదు. బలమయిన నేతలు అంతా వైసీపీలోనే ఉండిపోయారు. పార్టీని కాదనుకుని వెళ్లి మరి ఇటుగా వచ్చేందుకు అవకాశమే లేకపోవడంతో వాళ్లంతో జగన్ అనుచర వర్గంలో ఒకరుగా ఉండిపోయారు. కడప, కర్నూలు, అనంతపురంలో ఒకప్పటిలా బాబు మాట అంత వేగంగా చెల్లేందుకు అవకాశమే లేదు.
ఎందుకంటే అధికారంలో ఉండగా కొందరు నాయకులకే ఆ రోజు విపరీతంగా ప్రాధాన్యం ఇవ్వడంతో మిగిలిన నాయకులు అసంతృప్తితో రగిలిపోయేవారు. పార్టీ అధికారంలో ఉన్నా కూడా అధినేతను కలిసే సీన్ లేదు. ఇవన్నీ బాబుకు మైనస్ కానున్నాయి. జిల్లాల పర్యటనల్లో బాబుకు జనాలు రావొచ్చు కానీ అవే ఓట్ల రూపంలో మారిపోతాయా?
అన్నది విపక్ష పార్టీకి చెందిన కొందరి సందేహం. అదేవిధంగా ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ముఖ్యంగా నాయకులను తయారు చేయడంలో కూడా బాబు విఫలం అయ్యారు. చినబాబు ఉన్నా కూడా ఆయన నేర్చుకోవాల్సింది ఎంతో ! సోషల్ మీడియాలో పార్టీ బాగున్నా, బయట మాత్రం అవే తప్పిదాలు మరోసారి మరోసారి చేస్తూ ఉందన్నది పరిశీలకుల భావన.