బాబు-పవన్ లకు ఎర్రటి అవకాశం… చేస్తే ఫుల్ మైలేజ్!

సరైన అవకాశం లేక, ప్రతిపక్షపాత్రకు న్యాయం చేయలేక.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎంత ఇబ్బందిపడుతున్నారో తెలిసిందే! ఏపీలో అధికారపక్షాన్ని సరైన రీతిలో ప్రశ్నించలేని పరిస్థితికి చంద్రబాబు పడిపోయారు! చినబాబుని కాదనలేరు.. ఈ బాబేమో రాలేరు.. ఫలితంగా టీడీపీని ఇబ్బందుల్లోకి నెట్టేశారు. అయితే.. ఈ క్రమంలో తాజాగా బాబుకు ఒక సువర్ణావకాశం ఇచ్చారు కమ్యునిస్టులు! ఇది బాబుకు మాత్రమే కాదు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా!

వివరాల్లోకి వెళ్తే… మోడీ ప్రభుత్వం తీసుకున్న “మానిటైజేషన్” నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నా కూడా… మోడీ తనదైన ఒంటెద్దు పోకడలకు పోతున్నారు.. ప్రజల ఆస్తిని ప్రైవేటు పరం చేయడానికి ఉర్రూతలూగుతున్నారు! ఈ నిర్ణయంతో ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం కాబోతుంది.

దీంతో… ఈనెల 14వ తేదీన అనంతపురంనుంచి పాదయాత్ర ప్రారంభించాలని కమ్యునిస్టులు నిర్ణయించారు. ఇలా అనంతపురంలో ప్రారంభమైన ఈ యాత్ర… విశాఖలో పూర్తి చేసి, అనంతరం 21వ తేదీన వైజాగ్‌ లో “విశాఖ ఉక్కు”పై భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు ఎర్రన్నలు!

అయితే… విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తున్న అంశంపై ఏపీసర్కార్, కేంద్రానికి లేఖలైతే రాసింది కానీ.. తీవ్రస్థాయిలో ప్రశ్నించలేకుంది.. పోరాడలేకపోతుంది. దీంతో… విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులు ఒంటరైపోయారు. వారిస్థాయిలో వారు పోరాటాలు చేస్తున్నారు. అయితే.. వీరికి సరైన రాజకీయ అండ లేకుండా పోయింది. దీంతో… కమ్యునిస్టులు ఒక అడుగు ముందుకేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటుపరంపై పోరాడాలని నిర్ణయించారు. ఇది ఏపీలో ప్రతిపక్షంలో లో ఉన్న టీడీపీకి చాలా ప్లస్ అయ్యే విషయం. అధికారంపై కలలు కంటున్న జనసేనపై ప్రజలకు ఒక స్పష్టత వచ్చే సువర్ణావకాశం!

కమ్యునిస్టులు చేపట్టబోయే పాదయాత్రలోనూ, అనంతరం జరిగే భారీ బహిరంగ సభలోనూ టీడీపీ – జనసేనలు కలిసివస్తే… కచ్చితంగా ఆ రెండు పార్టీలకు చాలా ప్లస్ అవుతుందనే చెప్పాలి. ఇదే క్రమంలో ఏపీవాసులకు ఆ రెండు పార్టీలూ చాలా ఉపయోగపడినట్లే లెక్క! అయితే… ఈ సువర్ణావకాశాన్ని ఈ రెండు పార్టీలు ఉపయోగించుకుంటాయా? అన్నది పెద్ద ప్రశ్న!

ఎందుకంటే… కేంద్రంలోని బీజేపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏపీలో టీడీపీ పోరాడలేదు.. కనీసం ప్రశ్నించనూ లేదు. మోడీ పేరు చెబితేనే వణికిపోయే పరిస్థితికి చంద్రబాబు దిగిపోయారన్నా అతిశయోక్తి కాదు.. అనే స్థితికి బాబు పడిపోయారు. ఇక బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ, తన రాజకీయ జీవితంపై క్లారిటీ లేకుండా చేసుకున్న పవన్ కూడా.. బీజేపీ విధానలపై నిరసన గళం ఎత్తలేరు.

అలాకాకుండా… చంద్రబాబు, మోడీ భయాన్ని వీడి.. ప్రజల కోసం పోరాడితే.. రాజకీయంగా టీడీపీకి చాలా ప్లస్ అవుతుంది. ఇక మిత్రబంధం కంటే.. ఏపీ వాసుల ప్రయోజనాలు ముఖ్యమని పవన్ గుర్తించి రంగంలోకి దిగితే.. జనసేనపై జనాలకు ఒక క్లారిటీ వస్తుంది

మరి కమ్యునిస్టుల రూపంలో వచ్చిన ఈ సువర్ణావకాశాన్ని టీడీపీ, జనసేనలు ఉపయోగించుకుంటాయా? ప్రజా ప్రయోజనాలకోసం, ఏపీ హక్కుల కోసం పోరాడతాయా? లేక, ఏపీ ప్రజలు కాదు, మోడీ మనసులో చోటే తనకు ముఖ్యమని టీడీపీ అధినేత.. ప్రజాప్రయోజనాలకంటే మోడీతో స్నేహబంధమే ప్రాముఖ్యం అని జనసేన అధినేత భావిస్తారా అన్నది వేచి చూడాలి!