చంద్రబాబు అరెస్ట్‌తో టిడిపిలో సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. మొన్నటివరకు జగన్ ప్రభుత్వంపై దూకుడుగా ముందుకెళ్లిన టిడిపి..ఇప్పుడు అధినేత అరెస్ట్ తో దెబ్బకు సైలెంట్ అయింది. కేవలం బాబు ఎప్పుడు బయటకొస్తారనే అంశంపై ఫోకస్ పెట్టారు. ప్రజా సమస్యలు పక్కకు వెళ్ళాయి. ఇటు టిడిపి శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. జగన్‌కు కూడా కావాల్సింది ఇదే.
ఇలా టిడిపి ఉండగానే..ప్రజల్లో మరింత బలం పెంచుకుని గెలవాలనేది జగన్ ప్లాన్. అయితే ఇలాంటి పరిస్తితుల్లో వైసీపీ నేతలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏదో చంద్రబాబు అరెస్ట్ అయ్యారని ఆనందపడటం వల్ల ఉపయోగం ఉండదు. అలా కాకుండా పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకెళితే బెటర్. కానీ వైసీపీ నేతలు అలా చేయడం లేదు. ఎంతసేపు బాబు అరెస్ట్‌ని ఎగతాళి చేయడం, టిడిపి పని అయిపోయిందని కామెంట్లు చేయడం చేస్తున్నారు. ఇక రోజా లాంటి వారు బాబు అరెస్ట్ అయ్యారని సంబరాలు చేయడం, తిరుపతిలో మొక్కులు చెల్లించడం లాంటివి చేస్తున్నారు.
ఇలాంటివి చేయడం వల్ల వైసీపీ శ్రేణులు ఆనందపడతాయి గాని..సాధారణ జనం హర్షించే పరిస్తితి ఉండదనే చెప్పాలి. ఇంకా మంత్రులు ప్రెస్ మీట్లు పెడుతూ లోకేష్‌ని కూడా జైల్లో పెడతామని అనడం, టిడిపి మునిగిపోయిందని..ఇలా ఎంతసేపు టిడిపిని కామెంట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.
అదనంగా ఇలాంటి మాటల వల్ల వైసీపీకి నష్టం. పైగా టిడిపిని సంక్షోభం నుంచి బయటపడేస్తూ..వారికి ప్రజల సానుభూతి పెంచేలా చేస్తారు. కాబట్టి వైసీపీ నేతలు బాబు అరెస్ట్ పై సబ్జెక్ట్ పరంగా మాట్లాడి..మిగతాది రాష్ట్రానికి తాము న్యాయం చేశామని, సంక్షేమం, అభివృధ్ది చేస్తున్నామని చెప్పుకుంటే బెటర్. అలా కాకుండా ఎంతసేపు టిడిపి పైనే ఫోకస్ పెడితే..టిడిపికే వైసీపీ నేతలు మేలు చేసినట్లు అవుతుంది.