తిరుపతిలో టీడీపీ కొత్త వ్యూహం 50:70

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండూ తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. స్థానిక సంస్థల్లో సాధించిన ఘనవిజయం వైసీపీకి కొత్త నెత్తురు ఎక్కించగా, టీడీపీకి ఎదురైన పరాజయం పాఠాలు నేర్పింది. వరుస పరాజయాల నుంచి బయటపడి తిరుపతిలో గెలవడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ తన దృష్టిని కేంద్రీకరించింది. తన రాజకీయ సిద్ధాంతంలో భాగంగా కొత్త ఫార్ములాను తీసుకొచ్చింది. తిరుపతి లోక్‌స‌భ‌కు జరిగే ఉప ఎన్నికల్లో ఈ సూత్రాన్ని వర్తింపచేయనున్నారు.

 

రూటు మార్చారు

ప్రచార సరళిని మార్చిన తెలుగుదేశం నాయకత్వం సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక సమస్యలపై ఇంటింటి ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రతి 50 కుటుంబాలకు ఒక కార్యకర్తను నియమించనుంది. అంతేకాదు, టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో, లోకేష్ బైక్ యాత్ర ద్వారా ప్రచారం చేయాలని భావిస్తోంది. నేతలంతా అందుబాటులో ఉండాలని, తిరుపతి ప్రచారంలో పాల్గొనాలని చంద్రబాబు సూచించారు.

70 క్లస్టర్లు

తిరుపతి లోక్‌స‌భ‌ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే..ఒక్కో నియోజకవర్గాన్ని పది క్లస్టర్లు గా మొత్తం 70 క్లస్టర్లు గా విభజించారు. ఒక్కో నియోజకవర్గానికి మాజీమంత్రి ఇన్ఛార్జ్గా ఉంటారు. క్లస్టర్కు ఒక సీనియర్ నేత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలప్పగించారు. రూట్ మ్యాప్ త్వరలో ఖరారు చేయనున్నారు.

50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌

ఇంటింటి ప్రచారం నిర్వహించ‌డానికి టీడీపీ సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, స్థానిక సమస్యలపై ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాల‌ని అధిష్టానం నిర్ణయించింది. వాలంటీర్ వ్యవస్థను అడ్డంపెట్టుకొని వైసీపీ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తోందని తెలుగుదేశం ఆరోపిస్తోంది. 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉన్నట్లే టీడీపీ కూడా తిరుపతి ఎన్నికల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒక కార్యకర్తను టీడీపీ వాలంటీర్లా నియమించాలని ఆలోచిస్తోంది. దీనిపై కరపత్రాలు ముద్రించి ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. విస్త్ర‌తంగా ప్ర‌చారం చేయ‌డంవ‌ల్ల టీడీపీ వాలంటీర్ల‌పై అంద‌రూ దృష్టిసారిస్తార‌ని, దీంతో ప్ర‌భుత్వ వాలంటీర్లు రంగంలోకి దిగ‌గానే చ‌ట్ట‌ప‌రంగా వారిని ఇక్క‌ట్ల‌లోకి నెట్టొచ్చ‌నేది తెలుగుదేశం పార్టీ వ్యూహంగా క‌న‌ప‌డుతోంది.

అందుబాటులో న్యాయ‌వాదులు

వైసీపీని చట్టపరంగా ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక న్యాయవాదిని అందుబాటులో ఉంచనున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులపై లీగల‌సెల్‌ ద్వారా పిర్యాదు చేయనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సీనియర్లు బొండా ఉమ, టీడీ జనార్దన్, వర్ల రామయ్య, అశోక్బాబుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగించారు. వీరు తిరుపతి ప్రచారాన్ని ఇక్కడినుంచే పర్యవేక్షించనున్నారు. తిరుపతి లోక్‌స‌భ‌ స్థానాన్ని దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. తెలుగుదేశం పార్టీ వ్యూహ‌క‌ర్త రాబిన్‌శ‌ర్మ వ్యూహాలు ప‌నిచేస్తాయా? చంద్ర‌బాబు వ్యూహాలు గ‌ట్టెక్కిస్తాయా? జ‌గ‌న్ వ్యూహాలు విజ‌య‌వంత‌మ‌వుతాయో తెలియాలంటే కొద్దికాలం ఓర్పు వ‌హించాల్సిందే!!.