ఏపీ రాజ‌ధాని టీడీపీలోనే కాదు.. బీజేపీలోనూ బాంబు పేల్చిందే..!

-

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఒక ప్ర‌క‌ట‌న ఇప్పుడు ఏపీ రాజ‌కీయ ముఖ చిత్రాన్ని మార్చ‌బోతుంది. ఆయ‌న చేసిన ఒకే ఒక ప్ర‌క‌టన రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తుంది. సీఎం చేసిన రాజ‌ధాని ప్ర‌క‌ట‌న రాజ‌కీయ పార్టీల గుండెల్లో గుబులు రేపుతుంది. అదే ప్ర‌క‌ట‌న రాజ‌కీయ పార్టీల నేత‌ల్లో చీలిక‌ల‌కు దారి తీస్తుంది. అధికార వికేంద్రీక‌ర‌ణ పేరుతో జ‌గ‌న్ ప‌న్నిన ఉచ్చులో ఇప్పుడు ఏపీలోని జాతీయ‌, ప్రాంతీయ పార్టీలు చిక్కుకుంటున్నాయి. రాజ‌ధాని పేరుతో విసిరిన వ‌ల‌లో అన్ని పార్టీల నేత‌లు చిక్కుకుని విల‌విల లాడుతున్నారు. ప్ర‌ధానంగా టీడీపీ పార్టీ జ‌గ‌న్ దెబ్బ‌కు క‌కావిక‌లం అవుతుంది. అయితే  బీజేపీ నేతలు మాత్రం జ‌గ‌న్‌కు అనుకూలంగా కొంద‌రు.. కొంద‌రు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నారు.

బీజేపీలో రాజ‌ధాని విష‌య‌మై భిన్న‌స్వ‌రాలు వినిపిస్తున్నాయి. బీజేపీ పార్టీలో మొద‌టి నుంచి ఉన్న నాయ‌కులు ఒక‌ర‌కంగా స్పందిస్తే.. కొత్త‌గా పార్టీలో చేరిన వారు మాత్రం వ్య‌తిరేకిస్తున్నారు. ఇలా పార్టీలో భిన్న‌వాద‌న‌లు వినిపిస్తూ బీజేపీ పార్టీ స్టాండ్‌ను అస్ప‌ష్టంగా చెప్పి బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను అయోమ‌యానికి గురి చేస్తున్నారు. పార్టీలో మొద‌టి నుంచి ఉన్న‌ పార్టీ నాయ‌కులు మాత్రం జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నారు. అందులో ప్ర‌ధానంగా పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి జీవీఎల్ న‌ర‌సింహారావు జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించారు.

కానీ టీడీపీలో నుంచి బీజేపీలో చేరిన సుజ‌నాచౌద‌రి లాంటి నేత‌లు మాత్రం జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌డుతున్నారు. శివరామకృష్ణ కమిటీ కూడా వికేంద్రీకరణ జరగాలని చెప్పింది. అయితే గత టీడీపీ ప్రభుత్వం రిపోర్టులు,గ్రాఫిక్స్‌కే పరిమితమైందని.. చంద్రబాబు కూడా నారాయణ కమిటీని నియమించి అమరావతిలో నిర్మాణం చేపట్టారని, అధికార వికేంద్రీకరణను పట్టించుకోలేదని… దీంతో సీమాంధ్ర చాలా నష్టపోయిందని..  అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నామంటున్నారు జీవీఎల్ న‌ర‌సింహారావు. అంతేకాదు ఒకేచోట రాజధాని నిర్మాణంతో ఆర్థికాభివృద్ధి జరగదని..  రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటనపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు జీవీఎల్‌.

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కూడా జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించారు. కానీ ఇందులో కొంత మెలిక పెట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యాలి గానీ పరిపాలన వికేంద్రీకరణ కాదంటారు క‌న్నా. అమరావతి సీడ్ క్యాపిటల్లో పూర్తి శాసన,పరిపాలన వ్యవస్థ, హైకోర్టుబెంచ్, విశాఖ ఆర్ధికరాజధానిగా ఎదగడానికి కావాల్సిన ప్రోత్సాహకాలు, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యాలని  క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ అభిప్రాయ ప‌డుతున్నారు. కానీ సుజ‌నా చౌద‌రి మాత్రం అసలు మూడు రాజ‌ధానులు పెడుతుంటే కేంద్ర ప్ర‌భుత్వం ఊరుకుంటుందా.. జ‌గ‌న్ త‌న ఇష్టారాజ్యంగా చేస్తుంటే అని కామెంట్ చేస్తున్నాడు.

అంటే సుజ‌నాకు జ‌గ‌న్ చేస్తున్న‌ది న‌చ్చ‌డం లేద‌న్న‌ది సుస్ప‌ష్టం. అంటే బీజేపీ సీనియ‌ర్ నేత‌లు జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నారు. కానీ టీడీపీ నుంచి బీజేపీలో చేరిన‌వారు మాత్రం టీడీపీ పాటే పాడుతున్నారు. ఏదేమైనా జ‌గ‌న్ వ‌దిలిన బాణం ఇప్పుడు బీజేపీ గుండెల్లో గుచ్చుకున్న‌ట్లే క‌నిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news