జేసీ బ్రదర్స్ ను టీడీపీ పట్టించుకోదా ? వ‌దిలించుకుంటున్నారా?

-

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మాకు అనవసరం, మా హవా నడవాల్సిందే అన్నట్టుగా వ్యవహరించే వారు జేసీ బ్రదర్స్ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి.దానికి తగ్గట్టుగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, విభజన తరువాత ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలో కానీ వారి హవా నడిచింది. రాజకీయంగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, మున్సిపల్ చైర్మన్, ఇలా ఎన్నెన్నో పదవులు అనుభవించిన జేసీ బ్రదర్స్ హవా ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. అనంతపురం జిల్లా లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన జేసీ బ్రదర్స్ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. జెసి బ్రదర్స్ పై వరుసగా కేసులు నమోదు అవుతుండడం, జైలు పాలవుతుండడం వంటి వ్యవహారాలు చకచకా జరిగిపోతున్నాయి. దీంతో పాటు, వారి ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారాల్లో జెసి బ్రదర్స్ తప్పిదాలు కూడా ఉండడంతో, వారు దీనిపై గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది.

వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా అమ్మిన కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత రెడ్డి జైలుకు వెళ్లి, బెయిల్ పై బయటకు వచ్చారు. అప్పుడే ఓ పోలీస్ అధికారి పట్ల అనుచితంగా వ్యవహరించి మరోసారి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తరువాత కరోనా వైరస్ ప్రభావంకు గురై, ప్రస్తుతం జేసీ ప్రభాకర్రెడ్డి విశ్రాంతి బెయిల్ పై బయటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం పై మరోసారి జేసీ దివాకరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం మరింతగా ముదిరింది. వైసీపీతో పాటు, పనిలో పనిగా టిడిపి అధినేత చంద్రబాబును సైతం దివాకర్ రెడ్డి ఇరికించే విధంగా జేసీ వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.

ఇప్పటికే టిడిపికి చెందిన ఎంతో మంది నాయకులు వారి తరఫున ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, వారికి అండగా నిలబడుతూ వచ్చారు. కానీ జెసి బ్రదర్స్ విషయంలో, పార్టీ తరఫున ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. అసలు ఈ వ్యవహారాలతో పార్టీకి సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయిన సమయంలో, నారా లోకేష్ పరామర్శించడం మినహా మిగతా ఏ నాయకుడు వాళ్ళ వద్దకు వెళ్ళలేదు. చంద్రబాబు సైతం ఈ విషయంలో వారికి మద్దతుగా నిలబడేందుకు వెనుకడుగు వేస్తున్నారు. వారి కేసుల విషయంలో మిగతా పార్టీల వారి కంటే, టిడిపికి చెందిన వారే ఎక్కువగా ఆనంద పడుతున్నట్లు కనిపిస్తున్నారు. దీనికి కారణం జేసీ బ్రదర్స్ వ్యవహారశైలే కారణంగా చర్చ జరుగుతోంది.

లోకేష్ జేసీ ఫ్యామిలీని అప్పట్లో పరామర్శించిన సమయంలో, పెద్దగా ఆ జిల్లాకు చెందిన నాయకులు సైతం హాజరుకాకపోవడం, ఇప్పుడు జెసి ఫ్యామిలీ మరోసారి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలోనూ, పార్టీ తరపున వారికి మద్దతుగా మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం వంటి వ్యవహారాలన్నీ జేసీ బ్రదర్స్ కు తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. పరోక్షంగా జేసీ బ్రదర్స్ తప్పు చేసారని, ఫలితం అనుభవిస్తున్నారు అన్నట్లుగానే టిడిపి వ్యవహరిస్తోంది. వారిని ఇంకా వెనకేసుకొని వస్తే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది అనే భయం టిడిపిని వెంటాడుతోంది. అందుకే అధినేత నుంచి అనంతపురం జిల్లా నాయకులు వరకు, ఎవరూ జేసీ ఫ్యామిలీకి అండగా నిలబడేందుకు ముందుకు రావడం లేదట.

Read more RELATED
Recommended to you

Latest news