ఏపీ వ్యాప్తంగా టీడీపీ అసమ్మతితో అట్టుడుకుతోంది. ఆ పార్టీ నేత చంద్రబాబు మూడు విడతల్లో 138 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటివరకూ 30కి పైగా నియోజకవర్గాల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఆయా నియోజకవర్గాల్లో సీట్లు దక్కని నేతలు అధినేతపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. వాళ్ల అనుచరులు ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. పలుచోట్ల అసమ్మతి నాయకులు స్వతంత్రంగా బరిలోకి దూకేందుకు వెనుకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. వారిని బుజ్జగించేందుకు చంద్రబాబు వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ… సీనియర్ నేతలను వారి వద్దకు పంపుతూ… కొందరితో రాయబారాలు నడుపుతూ… సర్దిచెప్పేందుకు శత విధాలుగా యత్నిస్తున్నారు.
ఇవి కాకుండా జనసేన, బీజేపీకి కేటాయించిన 31 స్థానాల్లోనూ అనేక చోట్ల టీడీపీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టికెట్లు దక్కించుకున్నవారిని ఓడించి తమ సత్తా చూపిస్తామని పలువురు నేతలు బాహాటంగానే సవాల్ విసురుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, ఏలూరు జిల్లా నూజివీడులో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్‌గా ప్రచారం ప్రారంభించగా… విజయనగరం జిల్లా గజపతినగరంలో కె.అప్పలనాయుడు, విజయనగరంలో మీసాల గీత, కురుపాంలో వైరిచర్ల వీరేశ్‌దేవ్, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో కలమట వెంకటరమణ, తునిలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు.
చింతలపూడి, తిరువూరు, పెడన, పామర్రు, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులకు పూర్తి స్థాయి మద్దతు దొరకడంలేదు. కొవ్వూరు సీటు తనకు కేటాయించకపోవడంతో మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యతిరేకంగా పని చేసేందుకు సిద్ధమవుతున్నారు. గోపాలపురం సీటును మద్దిపాటి రాజుకు ఇవ్వడాన్ని అంగీకరించని అక్కడి పార్టీ సీనియర్ నేతలు ముళ్లపాటి బాపిరాజు తదితరులు తమను కాదని టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తామని హెచ్చరిస్తున్నారు. దెందులూరు సీటును చింతమనేని ప్రభాకర్‌కు ఇవ్వడం చలుమోలు అశోక్‌గౌడ్, ఈడ్పుగంటి నాగేశ్వరరావు, మాగంటి రవళితోపాటు అక్కడి పార్టీ సీనియర్ నేతలకు సుతరామూ ఇష్టం లేదు. వారంతా చింతమనేనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం సీటును ఫిరాయింపు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కి ఖరారు చేయడంతో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సహించలేకపోతున్నారు. పార్టీకి కట్టుబడి ఉన్నట్లు పైకి చెబుతున్నా వసంతను ఓడించడమే తన ధ్యేయమని ఆయన అంతర్గతంగా పార్టీ క్యాడర్‌కూ సంకేతాలు ఇస్తున్నారు. ఇలా ఆయా నియోజకవర్గాల్లో చంద్రబాబుకే సవాళ్లు విసురుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక చంద్రబాబు తల పట్టుకుంటున్నారు.