ఏపీ రాజకీయాలు బాగా రసవత్తరంగా నడుస్తున్నాయి…అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టిడిపిల మధ్య వార్ మామూలుగా లేదు. తిట్టుకోవడమే కాదు…ఆఖరికి కొట్టుకోవడం వరకు ఏపీ రాజకీయాలు వెళ్లిపోయాయి. ఈ క్రమంలోనే ఎవరికి వారు ప్రత్యేక డిమాండ్లతో రాజకీయం మొదలుపెట్టారు. అసలు టిడిపి ఆఫీసులపై వైసీపీ శ్రేణులు దాడి చేయడంపై చంద్రబాబు, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, ఇక రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు జరిగిన ఘటనలపై సిబిఐ విచారణ చేయాలని అంటున్నారు.
అయితే ఎలాంటి వాటికి రాష్ట్రపతి పాలన విధిస్తారో బాబుకు తెలియనిది కాదు….కానీ ఆయన అలా మాట్లాడటం వెనుక రాజకీయ కోణం ఉందనే చెప్పాలి. పైగా ఢిల్లీ స్థాయిలో రాష్ట్రంలో ఇలాంటి పరిస్తితులు ఉన్నాయని వైసీపీని నెగిటివ్ చేయాలని చూస్తున్నారు. కానీ బాబు డిమాండ్ చేస్తున్నట్లు రాష్ట్రపతి పాలన పెట్టడం జరిగే పని కాదు. అటు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సిఎంని దూషించడంపై వైసీపీ నేతలు కూడా…టిడిపిని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణలు ఈ రకమైన డిమాండ్లు చేస్తున్నారు. అలాగే వైసీపీ…కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. టిడిపి నేతల మాట్లాడిన బూతుల వీడియో క్లిప్పులని కూడా ఇవ్వనుంది. మరి వీటిని చూసి…ఎన్నికల సంఘం టిడిపి గుర్తింపుని రద్దు చేసేస్తుందా? అంటే అది కూడా సాధ్యమయ్యే పని కాదు. వైసీపీ కూడా కేంద్ర స్థాయిలో టిడిపిని దెబ్బకొట్టడానికి ఈ ఎత్తుగడని ఎంచుకుంది.
అలా అంటే వైసీపీ నేతలు…ఎన్నిసార్లు ఎన్నిరకాలుగా చంద్రబాబుని, పవన్ కల్యాణ్‌ని బూతులు తిట్టారో చెప్పాల్సిన పని లేదు. ఇక ఆ వీడియోలు పట్టుకుని వైసీపీని నిషేధించాలని టిడిపి-జనసేనలు ఫిర్యాదు చేస్తే…అప్పుడు రివర్స్ అయిపోతుంది. అసలు టిడిపి-వైసీపీలు చేసే డిమాండ్లు ఏ మాత్రం వర్కౌట్ కావనే చెప్పాలి. కేవలం రాజకీయం కోసమే రెండు పార్టీలు వేస్తున్న ఎత్తులు.