శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అరుదైన ఘనతను సాధించారు. రామ్మోహన్ నాయుడుకు ప్రతిష్టాత్మక ‘సంసద్ రత్న’ పురస్కారం లభించింది. మంచి పనితీరును కనపరిచే పార్లమెంటు సభ్యుడికి ఈ అవార్డును ఇస్తారు. మొత్తం 8 మంది లోక్‌సభ ఎంపీలను,ఇద్దరు రాజ్యసభ సభ్యులను అవార్డులకు ఎంపిక చేయగా… అతి పిన్న వయసులో రామ్మోహన్ నాయుడుకి ఈ పురస్కారం లభించడం విశేషం. రామ్మోహన్ నాయుడికి ‘జ్యూరీ కమిటీ స్పెషల్ అవార్డు’ను సంసద్ రత్న జ్యూరీ ప్రకటించింది.
ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, టీడీపీ శ్రేణులకు, కింజరపు అభిమానులకు అవార్డును అంకితమిస్తున్నట్టు తెలిపారు. అలాగే రాజకీయ ప్రముఖులు శశి థరూర్, సుప్రియ సూలే వంటి సీనియర్ నాయకులతో కలిసి ఈ అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా వుందన్నారు. శ్రీకాకుళం పార్లమెంటు సభ్యునిగా తాను చేసిన సేవలను గుర్తించిన ప్రజలే తనను మళ్లీ ఎంపీగా ఎన్నుకున్నారని, ఈ అవార్డు వారికే అంకితం అని పేర్కొన్నారు. ఈ పురస్కారం రావడంతో తన బాధ్యత మరింత పెరిగిందని, తన నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు.