విద్యనూ, వైద్యాన్నీ ఏ విధంగా విస్మరించినా ఓ ప్రభుత్వం విఫలం చెందిదనే భావించాలి. సరైన ఆస్పత్రులు ఇప్పటికీ చాలా చోట్ల లేవు. వైద్య రంగం కొత్త సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా, అందుకు తగ్గ విధంగా మౌలిక వసతులు లేని సందర్భాలెన్నో. పేదలంతా ప్రభుత్వ దవఖానాలకే వస్తారు కనుక వారి కోసం చేయాల్సింది ఎంతో ! ఆ విధంగా చేయాల్సినంత చేయాలి. ఉచిత వైద్యం అందించే క్రమంలో ఇప్పటి కన్నా మెరుగైన సేవలు ఏ ప్రభుత్వం అయినా బాధ్యతగానే భావించాలి.
అభివృద్ధి మాత్రమే మాట్లాడాలి అన్న నినాదంతోనే తెలంగాణ ఆవిర్భావ దినోత్స నిర్వహణకు సన్నద్ధం అవుతున్నారు ఆ పార్టీ పెద్ద కేసీఆర్. ఆ విధంగా వచ్చే ఎన్నికల్లో తిరుగులేని విజయం నమోదు చేసి, జాతీయ రాజకీయాల్లోనూ నెగ్గాలని ఆశిస్తున్నారు. ఇదే సమయంలో పేదలకు వైద్యం అందించడంను ప్రామాణికంగా తీసుకుని, మెరుగైన వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ కు ఆర్థిక పరంగా సవాళ్లు ఉన్నా కూడా వీలున్నంత మేర సంబంధిత పనులను మాత్రం చేపట్టేందుకే సుముఖత వ్యక్తం చేస్తున్నారు. సర్కారు వైద్యంపై భరోసా కల్పించడమే ధ్యేయంగా బస్తీ దవఖానాలు పనిచేస్తున్నాయి అని, అదేవిధంగా గాంధీ, ఉస్మానియా సేవల్లో ఎంతగానో మెరుగుదల పొందాయని సంబంధిత వర్గాలు ఇవాళ చెబుతున్న మాట.
సగటున రోజు 30-35 వేల ప్రజలకు ఉచిత వైద్యం, పరీక్షలు, మందులు ఇస్తున్నారు. ఇదే స్పూర్తితో పల్లె దవాఖానాలు ప్రారంభించాలని సూచించారు. కేసీఆర్ కిట్. మరో అద్భుతమైన పథకం… అని అంటున్నారు హరీశ్ రావు. అవును ! రోజుకు 30 వేల మంది అంటే నెలకు ఎలా చూసుకున్నా 9 లక్షల మంది. రోజుకు 35వేలు మంది అంటే నెలకు 10 లక్షలకు పైగానే ప్రజలు వైద్య సేవలు అందుకుంటున్నారు. అందుకే భాగ్య నగరి వాకిట సర్కారీ వైద్యానికి మరింత డిమాండ్ పెరుగుతోంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆస్పత్రుల నిర్మాణానికి కేసీఆర్ సన్నద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్నటి వేళ నగరంలో మూడు చోట్ల మూడు మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులకు శ్రీకారం దిద్దారు. టిమ్స్ పేరిట త్వరలోనే ఇవి నిర్మాణం జరుపుకోనున్నాయి. ఇవి పూర్తయితే భాగ్యనగరి వాసులకు వరమే !