ఇటు మాటల దాడి…అటు మౌనం…అసలు టార్గెట్ ఏంటి?

-

ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలి బండ స్కీమ్ కుడి కాలువ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కృష్ణా నదీ బోర్డు యజమాన్యానికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే బోర్డు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు బ్రేక్ వేసింది. అయినా సరే తెలంగాణ నేతలు ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతూనే ఉన్నారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకంముఖ్యంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి, జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. గతంలో వైఎస్సార్ తెలంగాణకు ద్రోహం చేశారని, ఇప్పుడు ఆయన తనయుడు జగన్ ద్రోహం చేస్తున్నారని, జగన్‌ది స్నేహ హస్తం కాదని, ద్రోహ హస్తం అని మండిపడుతున్నారు. అలాగే లంకలో ఉండేవాళ్ళంతా రాక్షసులు ఎలా అవుతారో? ఏపీలో ఉండేవాళ్ళంతా తెలంగాణ ద్రోహులే అని మాట్లాడారు. ఇక మంత్రి వ్యాఖ్యలపై మొదట్లో ఏపీ నుంచి కౌంటర్లు వచ్చాయి. రోజా, శ్రీకాంత్ రెడ్డిలాంటి వారు తెలంగాణ నేతలకు కౌంటర్లు ఇచ్చారు.

అయితే తాజాగా మాత్రం నేతలు సమన్వయంతో ఉండాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సెంటిమెంటును పెంచే యత్నంలో తెలంగాణ నేతలు కవ్వించినా… తాము హుంకరించబోమని అన్నారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండాలని జగన్ భావిస్తున్నారని, కాబట్టి నేతలు సమన్వయం పాటించాలని చెప్పారు. దీంతో ఏపీ నేతలు పూర్తిగా సైలెంట్ అయ్యారు.

కానీ తెలంగాణ నేతలు మాత్రం ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతూనే ఉన్నారు. ఇలా ఏపీ సైలెంట్ అయినా సరే తెలంగాణ నేతలు ఇంకా మాటల దాడి చేయడానికి కారణాలు లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ కోసం ఎప్పుడో జీవో ఇచ్చిందని, కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం స్పందింస్తుందని, హుజూరాబాద్ ఉప పోరులో లబ్ది పొందడానికే ఇలా తెలంగాణ సెంటిమెంటుని పైకి తీసుకొస్తుందని చెబుతున్నారు. అలాగే బీజేపీని సైతం ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తుందని అంటున్నారు.

ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అక్కడి ప్రాజెక్టులకు మద్దతుగా మాట్లాడుతున్నప్పుడు.. తెలంగాణ ప్రయోజనాల కోసం బండి సంజయ్‌ ఎందుకు మాట్లాడరని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించడం మొదలుపెట్టారని చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కూడా ఉన్నా సరే టీఆర్ఎస్, బీజేపీనే టార్గెట్ చేసిందని, దీని బట్టి రాజకీయంగా ఎలాంటి ప్రయోజనాలు ఆశిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news