కమలం దూకుడు..గులాబీ రచ్చ..అసలు కథ వేరే ఉందా?

తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. టీఆర్ఎస్-బీజేపీల మధ్య వార్ తారస్థాయికి చేరుకుంది. అసలు చిన్న చిన్న అంశాల్లో కూడా రెండు పార్టీలో ఓ రేంజ్‌లో మాటల యుద్ధానికి తెరతీస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీగా బీజేపీ, ప్రతి సమస్యపై పోరాటం చేస్తుంది. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అయితే ఆ పోరాటాలకు కౌంటరుగా టీఆర్ఎస్ మరింత ఎక్కువగా రాజకీయం చేస్తుంది. అంటే బీజేపీ పార్టీ దూకుడుగా ఉంటే…టీఆర్ఎస్ మాత్రం కాస్త రాజకీయంగా రచ్చ చేస్తున్నట్లే కనిపిస్తోంది.

bjp-trs
bjp-trs

చిన్న అంశాన్ని సైతం పెద్దగా చేస్తుంది. ఇలా చేయడం వెనుక ఏదో కారణం ఉండే ఉంటుందని విశ్లేషకులు అనుమానించే పరిస్తితి ఉంది. ఎందుకంటే మామూలుగా కౌంటర్లు ఇస్తే సరిపోతుంది. కానీ అరెస్ట్‌లు వరకు వెళ్లిపోతుందటే..ఏదో పెద్ద స్కెచ్‌తోనే ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా జీవో 317ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్షకు దిగిన బండి సంజయ్‌ని కోవిడ్ నిబంధనలు అతిక్రమించారని చెప్పి అరెస్ట్ చేశారు. అసలు దీనికి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా? అంటే పెద్దగా లేదనే సమాధానం వస్తుంది.

కాకపోతే రాజకీయంగా టీఆర్ఎస్, బీజేపీని రెచ్చగొడుతుందనే అనుమానాలు వస్తున్నాయి. అది కూడా కేంద్రాన్ని రెచ్చగొట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పైగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై దారుణమైన పదాలతో టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. ఆఖరికి కేటీఆర్ సైతం రంగంలోకి దిగి ఫైర్ అవుతున్నారు. అంటే కేంద్రంలోని బీజేపీ పెద్దలనే రెచ్చగొట్టాలని టీఆర్ఎస్ చూస్తున్నట్లు కనిపిస్తోంది.

అయితే బీజేపీపై టీఆర్ఎస్‌ ఇంత దూకుడుగా వెళ్ళడం వెనుక దర్యాప్తు సంస్థలు తమపై దాడులు చేస్తే.. ప్రజల్లో సానుభూతి పొందాలన్న వ్యూహం అయినా ఉండి ఉండాలి.. లేకపోతే ఇప్పటికే అలాంటి దాడులకు కేంద్రం.. బీజేపీ ప్రణాళిక సిద్ధం చేస్తే మైండ్ గేమ్‌తో ఆపేందుకు ప్రయత్నించే వ్యూహం అయినా అమలు చేస్తూ ఉండాలన్న అభిప్రాయం విశ్లేషకుల్లో వస్తుంది. మొత్తానికైతే టీఆర్ఎస్ మాత్రం రచ్చ పెంచుతున్నట్లే కనిపిస్తోంది.