ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని జనసేన తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. జగన్, చంద్రబాబులని రీప్లేస్ చేయాలని పవన్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా పవన్ ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. ఎలాగో 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి చేతులు కాల్చుకున్నారు. కేవలం ఒక సీటు మాత్రం గెలుచుకోగలిగారు. ఇక గెలిచిన ఆయన కూడా వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో ఏపీలో జనసేన పరిస్తితి ఘోరంగా తయారైంది.

కానీ పార్టీకి బలపడటానికి చాలా అవకాశాలు వచ్చాయి. పవన్ మాత్రం ఆ అవకాశాలని ఉపయోగించుకోలేదు. రెండున్నర ఏళ్లుగా పార్టీ బలోపేతం అయ్యే కార్యక్రమాలు పెద్దగా చేయలేదు. ఒక వైపు అధికార వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది…ఆ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవడంలో టీడీపీ విఫలమవుతుంది. ఇలాంటి పరిస్తితుల్లో పవన్ రాజకీయంగా ఎదగడానికి మంచి ఛాన్స్. కానీ అది కూడా యూజ్ చేసుకోలేదు. దాని వల్ల ఏపీలో జనసేన పరిస్తితి దారుణంగానే ఉంది.
ఒకవేళ పవన్ బలపడుతున్నారు అనుకుంటే…ఇతర పార్టీలోనే నాయకులు జనసేనలో చేరడానికి చూస్తారు. కానీ ఈ రెండున్నర ఏళ్లలో అలాంటి కార్యక్రమాలు ఏమి జరగలేదు. ఒక్క బలమైన నాయకుడు జనసేనలో చేరలేదు. ఈ మధ్య పవన్ దూకుడుగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టిన సరే…వేరే పార్టీ నాయకులు జనసేనలో చేరడానికి రావడం లేదు. కానీ ఇక్కడే పవన్‌కు అతి పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది. అది కూడా టీడీపీ రూపంలో. నెక్స్ట్ ఎన్నికల్లో పవన్, టీడీపీతో పొత్తు పెట్టుకుంటారని ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే.
ఇదే జనసేనకు బాగా ప్లస్ అయింది..జనసేనకు ఒంటరిగా గెలిచే సత్తా ఇంకా రాలేదు. ఇలాంటి సమయంలో టీడీపీతో కలిస్తే కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు. అందుకే కొందరు నాయకులు జనసేనలో చేరి సీటు దక్కించుకుంటే గెలిచే అవకాశాలు వస్తాయని భావిస్తున్నారట. ఒకవేళ పొత్తు ఉంటే ఏ సీట్లు అయితే దక్కే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారో…ఆయా నియోజకవర్గాల్లోని కొందరు నాయకులు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారట. అంటే టీడీపీ రూపంలో పవన్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చిందనే చెప్పాలి.