రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు.ఏపీలో మూడు స్థానాలకు ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఇప్పటివరకు వైసీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. అయితే నేడు నామినేషన్ సమర్పణకు చివరి రోజు కావడంతో రాజ్యసభ రేసు నుంచి ప్రతిపక్ష టీడీపీ తప్పుకుంది.దీంతో ఎన్నిక జరగకుండానే వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. వాస్తవానికి ఈనెల 17న పోలింగ్ జరగాల్సివుంది.కానీ నామినేషన్ వేసేందుకు టీడీపీ ముందుకురాక పోవడంతో ఎన్నికల అధికారులు ఏకగ్రీవాలను ప్రకటన చేయనున్నారు.
దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు నేటి( గురువారం )తో ముగియనుంది.వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావులు వైసీపీ రాజ్యసభ అభ్యర్థులుగా రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. కాగా రాజ్యసభ రేసు నుంచి తాము వైదొలుగుతున్నట్లుగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది.తాము రాజ్యసభ రేసుకు దూరంగా ఉండబోతున్నట్లు నిర్ణయించినట్లుగా టిడిపి తమ నేతలకు క్లారిటీ ఇచ్చింది. వేరే నామినేషన్లు లేకపోవడంతో ఈ ముగ్గురి ఎంపిక ఏకగ్రీవం కానుంది.ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటుందనుకున్న తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా బరిలోకి దిగి అభ్యర్థిని గెలిపించుకుంది. ఈసారి కూడా అలాగే జరుగుతుందని అనుకున్నారు.కానీ రాజ్యసభ ఎన్నికల విషయంలో టిడిపి ఏ నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొన్న సమయంలో వీటికి దూరంగా ఉండాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లుగా ప్రకటించారు.
ఇప్పటికే రాజ్యసభలో వైసీపీ తరపున 8 మంది సభ్యులుగా ఉన్నారు.కాగా ఈ ముగ్గురు ఏకగ్రీవమైతే వైసీపీ సంఖ్య 11కి చేరుకుంటుంది.దీంతో రాజ్యసభలో వైసీపీ బలమైన పార్టీగా అవతరించబోతోంది.ఈ రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మరో రెండేళ్ల వరకు పోటీ చేసే అవకాశం కోల్పోయింది.మరో నెలరోజుల్లో జరుగనున్న ఎన్నికల్లో ఆ పార్ట్ గౌరవప్రదమైన సీట్లు గెలుచుకుంటేనే ఆ పార్టీ నెక్స్ట్ పెద్దల సభకు అభ్యర్థులను పంపే అవకాశం ఉంటుంది.