కేరళలో చరిత్ర తిరగరాయనున్న విజయన్..విజయానికి కీలకంగా మారిన ఆ మూడు సంఘటనలు

-

కేరళలో రాజకీయం వేడెక్కింది. అధికార ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్, బీజేపీ మధ్య మాటలతూటాలు పేలుతున్నాయ్. రాష్ట్రంలో ఉనికి చాటుకునేందుకు బీజేపీ సర్వప్రయత్నాలూ చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగి ప్రత్యర్థి పార్టీలపై అస్త్రశస్త్రాలు సంధించారు. మరో రెండు రోజుల్లో పోలింగ్‌కు సిద్ధమవుతున్న కేరళలో మళ్లీ ఎల్‌డీఎఫ్‌కే ప్రజలు పట్టం కట్టేలా కనపడుతుంది. ఎల్డీఎఫ్‌ మరోసారి అధికారంలోకి వస్తే చరిత్ర తిరిగి రాసినవాడవుతాడి సీఎం పినరాయి విజయన్.

ఎల్డీఎఫ్‌ పాలనలో బంగారం దొంగ రవాణా, లైఫ్‌ మిషన్‌లో అవినీతి, ఐటీ విభాగంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. ప్రతిపక్ష యూడీఎఫ్‌ ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార ఆయుధాలుగా వాటిని మార్చుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కొవిడ్‌ కోరలుసాచిన రోజుల్లోనూ, వరదలు ముంచెత్తిన కాలంలోనూ వామపక్ష ప్రభుత్వం ఇంటింటికీ ఠంచనుగా రేషన్‌ సరకులు సరఫరా చేసింది. సహాయ కార్యక్రమాలను నిర్వీరామంగా చేసి…ప్రజలకు అండగా నిలిచింది.

గడిచిన అయిదేళ్లలో కేరళను నిపా వైరస్‌, రెండు భారీ వరదలు, కొవిడ్‌ విజృంభణ చుట్టుముట్టాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడంతో ఎల్డీఎఫ్‌కు ప్రజాదరణ అమాంతంగా పెరిగిపోయింది. దేశంలో మొట్టమొదటిసారిగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వోద్యోగాలు కల్పించి, వారి కోసం ప్రత్యేక సంక్షేమ చర్యలు తీసుకున్నారు. పౌరులందరికీ ఉచితంగా కె-ఫోన్‌ ఇచ్చి, అందుబాటు ధరలకు ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించారు.

వామపక్ష కూటమిలో విశ్వాసం కనబడుతుంటే, యూడీఎఫ్‌లో నాయకత్వ కుమ్ములాటలు ఇబ్బంది పెడుతున్నాయ్. యూడీఎఫ్‌ గెలిస్తే ముఖ్యమంత్రి తామేనంటూ ఉమెన్‌ చాందీ, రమేశ్‌ చెన్నితల, పీసీసీ చీఫ్‌ ఎం రాంచంద్రన్‌ ప్రచారం చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో..కంచుకోటల్లోనూ కాంగ్రెస్‌ ఓటమి పాలయింది. యూడీఎఫ్‌ గెలిచిన స్థానాల్లో అత్యధికం ఐయూఎంఎల్‌ ఆధిక్య ప్రాంతాల్లోనే ఉన్నాయి. దీంతో యూడీఎఫ్‌లో ఐయూఎంఎల్‌ పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తోంది.

మరోవైపు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రో మ్యాన్‌ శ్రీధరన్‌ను ప్రకటించి ఎన్నికలకు ఊపు తెచ్చింది. పీఎం నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పలువురు ప్రచారం చేశారు. యూడీఎఫ్‌ హాయాంలో సోలార్‌ స్కామ్‌..ఎల్డీఎఫ్‌ హాయంలో గోల్డ్ స్కామ్‌ అంటూ విమర్శలు గుప్పించారు. సురేశ్‌ గోపి వంటి సినీ గ్లామర్‌ ఉన్న వారిని రంగంలోకి దింపినా పెద్దగా ఫలితం కనిపించనట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news