ట్రెండ్ ఇన్ : తెరపైకి మరో మ‌న్యం జిల్లా ! ద‌టీజ్ జ‌గ‌న్ !

-

ఆంధ్రావ‌నిలో జిల్లాల ఏర్పాటు అన్నది స‌జావుగా పూర్త‌యిన ప్ర‌క్రియ అని అనుకునేందుకు వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొత్త,కొత్త ప్ర‌తిపాద‌న‌లు కొన్ని తెర‌పైకి వ‌స్తున్నాయి క‌నుక‌! గ‌తం క‌న్నా భిన్నంగా ఇప్పుడు పాల‌న స్వ‌రూపం మారిపోనుంది క‌నుక ! ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే రెండు మ‌న్యం జిల్లాల‌ను ప్ర‌క‌టించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తాజాగా మ‌రో జిల్లాను ఎనౌన్స్ చేయ‌నుంది. ఈ మేరకు మంత్రి పేర్నినాని కూడా ఇదే విష‌యాన్ని ధ్రువీక‌రించారు.

త్వ‌ర‌లో రంప‌చోడ‌వరం (ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలో విఖ్యాత గిరిజ‌న ప్రాంతం)ను, పోలవ‌రం ముంపు గ్రామాలు (విభ‌జ‌న త‌రువాత ప్రెసిడెంట్ గెజిట్ ద్వారా తెలంగాణ నుంచి వ‌చ్చి ఏపీలో చేరిన‌వి)ను క‌లుపుకుని మ‌రో మ‌న్యం జిల్లాకు శ్రీ‌కారం దిద్ద‌నున్నారు. ఇప్ప‌టికే పార్వ‌తీపురం మ‌న్యం పేరిట ఓ జిల్లా ఏర్పాటైంది. జిల్లా కేంద్రంగా పార్వ‌తీపురం ఉండనుంది. ఉమ్మ‌డి విశాఖ జిల్లాకు చెందిన పాడేరు కేంద్రంగా
మ‌రో జిల్లా అల్లూరు సీతారామ‌రాజు పేరిట ఏర్పాటైంది.

ఈ రెండూ కాకుండా మ‌రో మ‌న్యం జిల్లాకు శ్రీ‌కారం దిద్ద‌నుండ‌డం విశేష‌మే మ‌రి! ఇదే త‌రుణంలో మ‌రికొన్ని అభిప్రాయాలూ, ప్ర‌తిపాద‌న‌లూ వ్య‌క్తం అవుతున్నాయి. మ‌ద‌న‌ప‌ల్లె (ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా) ను జిల్లాగా ప్ర‌క‌టించాల‌ని ఆ ప్రాంత వాసులు ప‌ట్టుబ‌డుతున్నారు. ఏప్రిల్ నాలుగో తేదీ అంటే జిల్లాల ఏర్పాటుకు ముహూర్తంగా నిర్ణ‌యించిన రోజును వీరంతా బ్లాక్ డే గా పాటించారు. ఇదే స‌మ‌యంలో మ‌రికొన్ని ప్ర‌తిపాద‌న‌లూ ఉన్నాయి. ప‌శ్చిమ ప్ర‌కాశం జిల్లాకు తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని అంటున్నారు ఆ ప్రాంత వాసులు. అద్దంకిని ప్ర‌కాశం జిల్లాలో క‌ల‌పాల‌ని కానీ బాప‌ట్ల‌లో క‌లిపార‌ని ఇదెంత వ‌ర‌కూ న్యాయ‌మ‌ని ప్ర‌శ్నిస్తున్నారు అక్క‌డి స్థానికులు.

త‌మ‌కూ ప్ర‌కాశం జిల్లాకు మ‌ధ్య దూరం 34 కిలోమీట‌ర్లేన‌ని, కానీ త‌మ‌కూ బాప‌ట్ల‌కూ మ‌ధ్య దూరం 110కిలోమీట‌ర్లు అని వీరంతా ఆవేద‌న చెందుతున్నారు. అంటే జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే తాము దూరాభారాన్ని భ‌రించాల్సిందేనా అని ప్ర‌శ్నిస్తున్నారు. అదేవిధంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్ల జాబితాలో మార్కాపురం (ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా), ఆదోని (ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లా) కూడా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news