తెలంగాణలో రెండోసారి కేసీఆర్ సీఎం అయ్యాక అసంతృప్తులు, అలకలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. పార్టీ నుంచి నాలుగైదు సార్లు గెలిచిన నేతలకు మంత్రి పదవులు రాకపోవడంతో పాటు కీలక పదవులు ఆశించి భంగపడ్డ సీనియర్లు అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ లిస్టులో నాయిని నర్సింహారెడ్డి, కేకే, రాజయ్య, కడియం శ్రీహరి, ఈటల రాజేందర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో సీనియర్ ఎమ్మెల్యే గంప గోవర్థన్ వచ్చి చేరారు.
ప్రస్తుతం టీఆర్ఎస్‌లో పరిస్థితి చూస్తుంటే గంప గోవర్థన్ అలక వీడకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్‌కు షాక్ తప్పదన్న చర్చలు అధికార పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గంప గోవర్థన్ పార్టీ గురించి పట్టించుకోకపోవడంతో ఆ ఎన్నికల్లో పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుందని అంటున్నారు.
బీసీ వర్గానికి చెందిన ఆయన ఏకంగా ఐదుసార్లు గెలుస్తూ వస్తున్నారు. పైగా ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ ఆలీపై వరుస విజయాలు సాధిస్తున్నారు. కేసీఆర్ ఆయనకు విప్ పదవి కేటాయించారు. ఈ విప్ పదవి కేటాయించి ఏకంగా ఏడాది అవుతున్నా కూడా గంప గోవర్ధన్ ఆ పదవిని చేపట్టలేదట. తనకన్నా జూనియర్లు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లు… అసలు ఎమ్మెల్యేగా గెలవలేని వాళ్లు కూడా మంత్రులు అయ్యారు.
ఐదు సార్లు గెలిచిన తాను మంత్రి పదవికి అర్హుడిని కానా ? అన్నదే ఆయన బాధ అట. అందుకే కేసీఆర్ తనకు ఇచ్చిన విప్ పదవిని ఆయన తిరస్కరించారని టాక్. కేసీఆర్ వైఖరికి నిరసనగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో ఆ ఎఫెక్ట్ కామారెడ్డి జిల్లాపై పడుతుందన్న ఆందోళన స్థానిక పార్టీ వర్గాల్లో ఉంది. అయినా కూడా అధిష్టానం ఆయన్ను లైట్ తీస్కొంటోందట.