ఇదీ లెక్క … ఒక్కటి గెలిచినా ఓడినట్టే…!

-

గ్రేటర్ ఎన్నికల యుద్ధం ముగిసింది ఫలితాల కోసం ఉత్కంఠగా అందరూ వేచి చూస్తున్నారు. మరి కొద్ది గంటల్లోనే ఫలితాల ప్రకటన ఉండబోతోంది. అప్పుడే గ్రేటర్ ను ఎవరు ఏలబోతున్నారు అనేది స్పష్టత వస్తుంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ అంతా, బిజెపి టిఆర్ఎస్ మధ్య నడిచింది. ఇప్పుడు మరికొద్ది గంటల్లో ఈ రెండు పార్టీలు ఎవరి సత్తా ఏంటో చాటుకోబోతున్నాయి. 150 డివిజన్లు ఉన్న గ్రేటర్ లో ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తే వారికి రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం చలాయించే అవకాశం ఉండబోతోంది. టిఆర్ఎస్ బిజెపి ఈ రెండు ఎన్నికల ఫలితాలపై ఆసక్తి గా ఉన్నాయి. ప్రస్తుతం బ్యాలెట్ ఓట్లలో బిజెపి ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక గ్రేటర్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ లతో పాటు మరికొన్ని స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉంది. వివిధ సర్వేల్లో బీజేపీకి 70 వరకు స్థానాలు వస్తాయని లెక్కలు బయటకు వచ్చిన తరుణంలో,  ఉత్కంఠ నెలకొంది.
ఇది ఇలా ఉంటే  గ్రేటర్ పీఠంపై టిఆర్ఎస్ జెండా ఎగిరినా, బిజెపి గతంలో ని  స్థానాల కంటే, ఎక్కువ స్థానాలను దక్కించుకంటే టిఆర్ఎస్ గ్రేటర్ లో గెలిచినా ఓడినట్టే. అసలు తెలంగాణలో అంతంత మాత్రంగా బీజేపీ పరిస్థితి ఉండేది. అయితే ఒక్కసారిగా దుబ్బాక ఉప ఎన్నికలలో బిజెపి గెలిచి అందరికీ షాక్ ఇచ్చిందిి. ముఖ్యంగా అక్కడ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ప్రభావం ఎక్కువగా కనిపించడం ,  ఆయనకు నియోజకవర్గంలో పట్టు ఎక్కువగా ఉండటం వంటి వ్యవహారాలు బీజేపీకి బాగా కలిసి వచ్చాయి.
ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలలో బీజేపీ  ప్రభావం చూపించడం , టిఆర్ఎస్ కు ప్రధాన పోటీదారులం తామే అన్నట్లుగా వ్యవహరించడానికి అవసరమైన భరోసాను దుబ్బాక ఉప ఎన్నికలు ఇచ్చాయి అని చెప్పడంలో సందేహం లేదు. దీనికితోడు బిజెపి అగ్రనాయకులు , రాష్ట్ర నాయకులు సమిష్టిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం బిజెపి విధానాలు ఏమిటో చెప్పడం, టీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిస్తూ, ఆ పార్టీకి బలం తగ్గించే విధంగా చేయగలగడం, ఇలా అన్నిటిలోనూ బిజెపి సక్సెస్ అయ్యింది.
ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ , దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇలా ఎవరికి వారు గట్టిగానే తమ ప్రభావం చూపించేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా వరదల కారణంగా గ్రేటర్ ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను, టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం , స్థానిక సమస్యలను హైలెట్ చేస్తూ టీఆర్ఎస్ పై విమర్శలు చేసిన తీరు జనాలను కాస్త ఆసక్తిని , ఆలోచనను కలిగించాయి.
అసలు గెలుపు పై మొదట్లో ధీమాగా ఉంటూ వచ్చిన టీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించే స్థాయికి బిజెపి ఎదగడం చూస్తుంటే , రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బిజెపి ప్రభావం ఏస్థాయిలో ఉండబోతోంది అనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. ఇప్పుడు గ్రేేేటర్ పీఠం టిఆర్ఎస్ కు దక్కినా బిజెపి దక్కించుకో బోతున్న స్థానాలను లెక్కలోకి తీసుకుంటే టిఆర్ఎస్ ఇక్కడ గెలిచినా, ఓడినట్టే అవుతుంది. అలా కాకుండా బీజేపీనే మేయర్ పీఠాన్ని సాధిస్తే ఇక రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news