వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో సిట్టింగ్ కార్పోరేటర్లకు షాకివ్వనున్న టీఆర్ఎస్

-

వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల్లో సిట్టింగ్ కార్పోరేటర్లకు షాకిచ్చేలా ఉంది అధికార టీఆర్ఎస్. ఏకంగా దాదాపు సగం మంది కొత్తవారికి చాన్సివ్వాలని లెక్కలేస్తుంది. అయితే ఈ భారీ మార్పుల వెనుక ఆసక్తికర పరిణామాలు జరిగినట్లు తెలుస్తుంది. వరంగల్ ఎన్నికలకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో లింక్ పెట్టిన గులాబీ పార్టీ సిట్టింగ్‌లకు మళ్లీ టికెట్లు ఇచ్చే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.


గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ఎక్కువశాతం సిట్టింగ్‌ కార్పొరేటర్లకు టికెట్లు ఇచ్చినా టీఆర్‌ఎస్‌కు ఆశించిన స్థానాలు రాలేదు. ఆ ఎఫెక్ట్‌ ఇప్పుడు గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై పడింది. అంతర్గత సర్వేలు చేసి మరి అభ్యర్దుల విషయంలో ఆచితూచి లెక్కలేస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో వరంగల్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు 30 మంది వరకు పాల్గొన్నారు. వారంరోజులపాటు అక్కడే మకాం వేశారు. అక్కడ గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని.. వరంగల్‌ తిరిగి రాగానే డివిజన్లనే అంటిపెట్టుకుని ఉన్నారట. పెండింగ్‌ పనులు పూర్తి చేయడం మొదలుకొని జనాల్లోనే నిత్యం తిరిగినట్టు చెబుతున్నారు. కార్పొరేటర్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొందరికి మొండి చెయ్యి తప్పదన్న ప్రచారం నడుస్తుంది.

టీఆర్‌ఎస్‌ నిర్వహించిన రెండు మూడు సర్వేలలో కొందరు కార్పొరేటర్లపై వ్యతిరేకత గుర్తించారట. అలా గుర్తించిన వారికి టికెట్‌ ఇవ్వడం లేదని తెలుస్తోంది. మొహమాటానికి పోతే గ్రేటర్ ఫలితాలే వరంగల్‌లో రిపీట్‌ అవుతాయని ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు భయపడుతున్నారట. ఎటు చూసినా సిట్టింగ్‌ కార్పొరేటర్లలో 40 శాతం మందికి టికెట్‌ ఇవ్వడం లేదన్న సంగతి స్థానిక కార్పోరేటర్లలో గుబులు రేపుతుంది. గ్రేటర్‌ వరంగల్‌లో గతంలో 58 డివిజన్లు ఉంటే.. 44 చోట్ల టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు గెలిచారు. ఇండిపెండెంట్లు, కాంగ్రెస్‌ నుంచి గెలిచిన వారు తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరడంతో ఆ సంఖ్య 52కు చేరింది.

వార్డుల పునర్విభజనతో ఇప్పుడు డివిజన్ల సంఖ్య 66కు చేరింది. మొన్నటి ఎన్నికల మాదిరే తిరిగి పాగా వేయాలంటే ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్‌లను మార్చాలనే నిర్ణయానికి వచ్చారట. డీలిమిటేషన్‌ వల్ల రిజర్వేషన్లు మారి కొందరు కార్పొరేటర్లు తమ స్థానాలను కోల్పోయారు. అలాంటి వారు సైతం అయోమయంలో ఉన్నారట. బీసీ జనరల్‌, ఓసీ డివిజన్లలో టికెట్ కోసం పోటీ పడుతున్నవారు ఎక్కువగా ఉండటంతో ఎవరికి చాన్స్ దక్కుతుందో అన్న టెన్షన్ స్థానిక నేతల్లో ఉంది. రకరకాల ఈక్వేషన్ల మధ్య మళ్లీ చాన్స్ దక్కుతుందా లేదా తెగ టెన్షన్ పడుతున్నారట టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పోరేటర్లు.

Read more RELATED
Recommended to you

Latest news