పొంగులేటి సీటుపై ట్విస్ట్‌లు.. పువ్వాడని వదలడం లేదు.!

-

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా గెలవకూడదనే కసితో పనిచేస్తున్నారు. బి‌ఆర్‌ఎస్ నుంచి అవమానంతో బయటకొచ్చిన ఆయన..కాంగ్రెస్ లో చేరారు. ఇక ఖమ్మంలో బి‌ఆర్‌ఎస్ నుంచి ఒక్కరినీ కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను అని సవాల్ చేశారు. దీని బి‌ఆర్‌ఎస్ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇక ఖమ్మంలో ఉన్న ఏకైక మంత్రి పువ్వాడ అజయ్ సైతం..10కి 10 సీట్లు బి‌ఆర్‌ఎస్ గెలుస్తుందని, అసెంబ్లీకి వెళ్లకుండా ఎలా ఆపుతారో చూస్తామని సవాల్ చేశారు.

ఇలా ఖమ్మంలో పొంగులేటి, పువ్వాడ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రాజకీయంగా పోరు నడుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా పొంగులేటి ఖమ్మం జిల్లా ప్రజలు కోరిక మేరకు తాను ఇదే గడ్డపై పోటీ చేసి ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్న మంత్రిని ఇంటికి పంపిస్తానని, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. దీంతో పొంగులేటి డైరక్ట్ గా పువ్వాడపై పోటీ చేస్తారా? లేక అక్కడ బలమైన కాంగ్రెస్ అభ్యర్ధిని పెట్టి పువ్వాడని ఓడిస్తారా? అనే చర్చ సాగుతుంది.

అయితే ఖమ్మంలో మూడు జనరల్ సీట్లు ఉన్నాయి. కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు సీట్లు ఉన్నాయి. ఇప్పటికే షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చి పాలేరులో పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇక పొంగులేటి కొత్తగూడెం బరిలో ఉంటారని ప్రచారం వచ్చింది. ఖమ్మంలో రేణుకా చౌదరీ గాని..వేరే నాయకుడు గాని పోటీ చేస్తారని తెలిసింది. కానీ ఇప్పుడు మంత్రిని ఓడిస్తానని పొంగులేటి సవాల్ చేశారు.

దీంతో పొంగులేటి..పువ్వాడపై డైరక్ట్ గా పోటీ చేస్తారా? అనే చర్చ సాగుతుంది. ఒకవేళ పోటీ చేస్తే ఖమ్మం అసెంబ్లీలో ఆసక్తికరమైన ఫైట్ జరుగుతుంది. అలా కాకుండా రేణుకా చౌదరీ పోటీ చేస్తే ఆమెకు పొంగులేటి సపోర్ట్ గా ఉంటూ పువ్వాడని ఓడించే ప్రయత్నం చేయవచ్చు. చూడాలి మరి పొంగులేటి ఏ సీటులో పోటీ చేస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news