తూర్పులో టీడీపీ-జనసేన పంచాయితీ..తేడా కొట్టేస్తుంది.!

-

ఇంకా పొత్తు అధికారికంగా ఫిక్స్ కాలేదు కానీ..అప్పుడే టి‌డి‌పి-జనసేనల మధ్య సీట్ల పంచాయితీ నడుస్తోంది. రెండు పార్టీల నేతలు సీట్ల కోసం ఇప్పటినుంచే పోటీ పడుతున్నారు. సీటు తమకు దక్కుతుందంటే..తమకు దక్కుతుందని చెప్పుకుంటున్నారు. ఒకవేళ సీటు దక్కకపోతే కొందరు నేతలు ఇండిపెండెంట్లుగా పోటీ చేయడానికి కూడా రెడీ అయిపోతున్నారు. అదే జరిగితే ఓట్లు చీలిపోయి మళ్ళీ వైసీపీకే లాభం జరుగుతుంది.

ఇక జనసేనకు కాస్త ఎక్కువ బలం ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లోనే ఈ  సీట్ల పంచాయితీ ఎక్కువ ఉంది. గత ఎన్నికల్లో 19 సీట్లకు వైసీపీ 14, టి‌డి‌పి 4, జనసేన 1 సీటు గెలుచుకుంది. అయితే వైసీపీ గెలిచిన 14 సీట్లలో జనసేన 10 సీట్లలో ఓట్లు చీల్చింది. దీని వల్ల టి‌డి‌పికి నష్టం జరిగింది. కానీ ఈ సారి అలా జరగకూడదని పొత్తు దిశగా వెళుతున్నాయి. పొత్తులో వెళ్తున్నా ఏ సీటు ఎవరికి దక్కుతుందో క్లారిటీ లేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారంలో తూర్పులో రెండు పార్టీలు పోటీ పడే సీట్లు కొన్ని ఉన్నాయి.

పొత్తు ఉంటే మొదట టి‌డి‌పికి ఖచ్చితంగా దక్కే సీట్లు..పెద్దాపురం, రాజమండ్రి సిటీ, మండపేట, అనపర్తి, తుని, రంపచోడవరం, జగ్గంపేట, ప్రత్తిపాడు, పి.గన్నవరం సీట్లు.  ఇక జనసేనకు రాజోలు ఒకటే క్లారిటీ ఉంది. ఇక ముమ్మిడివరం, కొత్తపేట, కాకినాడ సిటీ, రూరల్, రాజమండ్రి రూరల్, రాజానగరం, పిఠాపురం, అమలాపురం, రామచంద్రాపురం సీట్లలో క్లారిటీ లేదు.

ఈ సీట్లలో టి‌డి‌పికి బలం ఉంది..అదే సమయంలో జనసేనకు అమలాపురం, కాకినాడ సిటీ, రూరల్, రాజమండ్రి రూరల్, పిఠాపురం లాంటి సీట్లలో బలం ఎక్కువే. మిగిలిన సీట్లలో గెలుపోటములని తారుమారు చేయగలదు. దీంతో ఈ సీట్ల విషయంలో పంచాయితీ నడుస్తోంది. అందులో రాజమండ్రి రూరల్ టి‌డి‌పి సిట్టింగ్ సీటు. సీనియర్ నేత బుచ్చయ్య చౌదరీ ఉన్నారు. ఈ సీటు టి‌డి‌పి వదులుకోదు..కానీ ఇక్కడ జనసేనకు బలం ఉంది. ఇలా ప్రతి సీటులో రచ్చ ఉంది.

మరి పొత్తులో సీట్లు ఎలా దక్కుతాయో చూడాలి. సీటు దక్కని వారు ఇండిపెండెంట్లుగా బరిలో దిగితే పొత్తుకే నష్టం.

Read more RELATED
Recommended to you

Latest news