ఆంధ్రావనిలో ఈ రోజు కొత్త మంత్రి వర్గం కొలువు దీరనుంది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం అనుసరించి ఉదయం 11 గంటల 31 నిమిషాలకు సచివాలయం బ్లాక్ 1 పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.అయితే మంత్రి వర్గ విస్తరణతో సామాజిక న్యాయం జరిగిందని ప్రభుత్వ పెద్ద సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు.
ఎన్నడూ లేని విధంగా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని ఆయన చెబుతున్నారు. ఇదెలా ఉన్నా గత మంత్రులెవ్వరూ పూర్తి స్థాయిలో పనిచేసిన దాఖలాలు లేవు. అప్పుడు అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో అవినీతి బాగానే జరిగింది కానీ అది మీడియా లో ఫోకస్ కాలేదు. ఇదే సందర్భంలో మంత్రులకు తమ తమ శాఖలపై అస్సలు పట్టే లేదు అని తేలిపోయింది.
ట్విటర్ పోల్ : ఏపీలో మంత్రివర్గ విస్తరణతో పాలన మెరుగవుతుందా? @YSRCParty @JaiTDP @JanaSenaParty @BJP4Andhra
— Manalokam (@manalokamsocial) April 11, 2022
ప్రతి పథకాన్నీ సీఎం మీట నొక్కి ప్రారంభిస్తుంటే తాము ఉన్నా లేకపోయినా ఒక్కటే అన్న భావనకు వచ్చేశారు. అదేవిధంగా వివిధ పథకాలకు సంబంధించి ప్రముఖ పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు జారీ చేసే సమయంలో కూడా తమ ఫొటో కూడా వేయని దాఖలాలు అనేకం ఉన్నాయని కూడా ఆవేదన చెందిన వారు ఉన్నారు. చిన్న చిన్న పనులు కూడా సీఎం డైరెక్షన్లోనే జరిగేవి అని తాము చెప్పినా సచివాలయంలో ఉన్నతాధికారులు మాట వినని సందర్భాలు అనేకం ఉన్నాయని ఇప్పటికీ పలువురు తాజా మాజీలు అంటూనే ఉంటారు.
ఇక మంత్రులెవ్వరికీ తమ తమ శాఖలపై పట్టు లేకపోగా కనీస అధ్యయనంతో అయినా ప్రభుత్వాన్ని నడపాలన్న ఆలోచన అయితే అస్సలు లేదు. మంత్రులే కాదు ఎమ్మెల్యేలకు కూడా శాసన సభ వ్యవహారాలపై అస్సలు పట్టు లేదు. అవగాహన లేదు.
దీంతో సీఎం జగన్ అంతా తానై నడిపిస్తున్నారు. ఇదే సమయంలో కాస్తో కూస్తో అవగాహన ఉన్న సీనియర్లు ఏమయినా సలహాలు ఇచ్చినా, సూచనలు ఇచ్చినా సీఎం వినిపించుకోని దాఖలాలు ఉన్నాయి. మంత్రులంతా కేవలం డమ్మీలే ! ఇప్పటిదాకా! మరి! రేపటి వేళ కూడా ఇదే విధంగా ఉంటుందా ? అంతా జగన్మోహనుడి దయ.