వంగవీటి రాధా… రాజకీయాల్లో విఫలమైన నేత అని చెప్పొచ్చు. ఎందుకు విఫలమైన నేత అంటే…ఆయన రాజకీయ జీవితం మొత్తం పరిశీలిస్తే అలాగే అనిపిస్తుంది. అయితే ఎంత రాజకీయాల్లో విఫలమైన తన కాపు సామాజికవర్గంలో క్రేజ్ గల నాయకుడు. అందుకే ఎన్ని సార్లు ఫెయిల్ అయిన రాజకీయాల్లో ఉండగలిగారు. కానీ ఈ సారి ఫెయిల్ అయితే ఆయన ఇక రాజకీయాల్లో అడ్రెస్ ఉండరని అనిపిస్తోంది. కానీ ఆయన మళ్ళీ ఫెయిల్యూర్ వైపే పయనిస్తున్నట్లు తెలుస్తోంది. వంగవీటి రాధా రాజకీయ జీవితంలో ఎక్కువగా తప్పటడుగులు ఉన్నాయి. కాంగ్రెస్ లో రాజకీయ జీవితం మొదలుపెట్టిన వంగవీటి తొలిసారి 2004లో విజయవాడ ఈస్ట్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు.
అయితే దీని తర్వాత రాధా తప్పటడుగులు వేయడం మొదలుపెట్టారు. 2009 ఎన్నికల ముందు చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యంలో చేరి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఒకవేళ కాంగ్రెస్ లో ఉంటే పరిస్తితి వేరేగా ఉండేది. ఇక వైఎస్ మరణం, తర్వాత జగన్ కొత్త పార్టీ పెట్టడం జరగడంతో చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. పోనీ అలా చిరంజీవితో పాటు వెళ్ళి అధికార పార్టీ నేతగా ఉన్నారంటే అది చేయలేదు. అలా చేయకుండా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అటు వైసీపీ కూడా ప్రతిపక్షంలో కూర్చుంది. దీంతో ఆ ఐదేళ్లు సైలెంట్ గా ఉన్న వంగవీటి మొన్న ఎన్నికల ముందు జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తూ టీడీపీలోకి వెళ్లారు. టీడీపీలోకి వెళ్ళిన ఆయన పోటీ చేయకుండా ప్రచారానికి పరిమితమయ్యారు. ఇక మొన్న ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. టీడీపీ ఘోరంగా ఓడిపోయి 23 సీట్లు తెచ్చుకుంటే వైసీపీ 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చేసింది, ఒకవేళ రాధా వైసీపీలో ఉండి ఉంటే ఎంపీనో, ఎమ్మెల్యేనో అయ్యేవారు. అన్నీ కుదిరితే మంత్రి కూడా అయ్యేవారేమో. కానీ అలా కాకుండా టీడీపీలోకి వెళ్ళి రాజకీయ భవిష్యత్ ని మరింత శూన్యం చేసుకున్నారు.
తాజాగా టీడీపీ నేతలు చాలామంది బీజేపీ,వైసీపీల్లోకి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో రాధా కూడా పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. అయితే అది వైసీపీ-బీజేపీల్లోకి కాదు. మొన్న ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ఒక్క సీటు గెలుచుకున్న జనసేనలోకి. తాజాగా తూర్పు గోదావరి పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ తో రాధా భేటీ అయ్యారు. రాజమండ్రి వెళ్లిన పవన్ కల్యాణ్ ను రాధా కలవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలని చూస్తుంటే ఆయన జనసేనలోకి వెళ్ళడం ఖాయమని అర్ధమవుతుంది. మొత్తానికి రాధా మరో తప్పటడుగు వేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.