ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయాయి. తెలంగాణ ఉద్యమంతో దిగి వచ్చిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రాన్ని రెండుగా చీల్చింది. ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఆంధ్రా ప్రజలు భూస్థాపితం చేశారు. ఇప్పట్లో కోలుకునే అవకాశమే లేదు. కనీసం పునరుజ్జీవనానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ నేతలకు ఏపీలో రాజకీయంగా పని లేకుండా పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చక్రం తిప్పిన ఆంధ్రా కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో మకాం వేశారు.
వారిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఆప్తమిత్రుడు కేవీపీ రామచంద్రరావు కూడా ఒకరు. ఇటీవల ఆయన తనను తెలంగాణ వ్యక్తిగానే చూడాలని కాంగ్రెస్ పార్టీని, నాయకులను కోరుతున్నారు. దశాబ్దాలుగా తాను తెలంగాణలోనే ఉన్నానని, తనను తెలంగాణలో కలుపుకోవాలన్నారు. ప్రాణం పోయిన తర్వాత కూడా తాను తెలంగాణ మట్టిలోనే కలసిపోతానని చెప్పారు. అందువల్ల తనను సగం తెలంగాణ వ్యక్తిగా పరిగణించాలని అభ్యర్ధిస్తున్నారు.
అయితే కేవీపీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కౌంటర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా వీహెచ్ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర విభజన వద్దని వాదించినప్పుడు తెలంగాణ గుర్తుకు రాలేదా అంటూ కౌంటర్ ఇచ్చారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేసినప్పుడు తెలంగాణ ఉద్యమం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సగం తెలంగాణ వ్యక్తిగా చూడాలని నిలదీశారు. ఏపీలో పార్టీ బలహీనంగా ఉన్న కారణంగానే ఇప్పుడు కేవీపీకి తెలంగాణ గుర్తుకు వస్తోందంటూ చురకలు అంటించారు. తెలంగాణలో రోజురోజుకీ కాంగ్రెస్ బలపడుతోందని, రాజకీయంగా అవకాశాల కోసం అర్రులు చాసేందుకు ఇలాంటి వ్యాఖ్యలు కేవీపీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి వెళ్ళి పని చేస్తూ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని కేవీపీకి సలహా ఇచ్చారు వీహెచ్.