ఫోన్‌ చూస్తూ తింటున్నారా..? జర ఆగండి.. ఈ రోగాలను ఆపండి.!

-

ఈరోజుల్లో పర్స్‌ లేకుండా ప్రయాణించవచ్చు కానీ.. ఫోన్‌ లేకుండా పక్క ఊరుకు కాదు కదా పక్క వీధికి కూడా వెళ్లడం లేదు. అంత అలవాటు అయిపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ ఫోన్‌ మన పక్కనే ఉంటుంది. చాలా మంది తినేప్పుడు కూడా ఇన్‌స్టాలో రీల్స్‌ చూస్తూ తింటారు. ఇంతకు ముందు టీవీ చూస్తూ తినేవాళ్లు.. కానీ ఇప్పుడు ఇలా తయారయ్యారు. ఈ మార్పు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలా మొబైల్ ఫోన్లు చూస్తూ ఆహారం తింటే లాభం కంటే నష్టమే ఎక్కువ అంటున్నారు నిపుణులు. మనం మొబైల్ ఫోన్లు చూస్తూ ఆహారం తీసుకోవడం వల్ల చాలా రోగాలు మనకు వస్తాయట.

తినే సమయంలో మన దృష్టి అంతా మొబైల్ పైనే ఉంటుంది. మనం ఎంత తిండి తిన్నామో, కడుపు నిండిందో లేదో కూడా గమనించం. ఒకదాని తర్వాత మరొకటి కడుపులోకి వెళ్లడం వల్ల మనం ఆకలి కంటే ఎక్కువ ఆహారం తీసుకుంటాం. అధిక వినియోగం ఊబకాయానికి దారితీస్తుంది. రాత్రిపూట ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటే ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఊబకాయంతో అనేక వ్యాధులు వస్తాయి.

మనం మొబైల్ చూస్తూ ఆహారాన్ని తీసుకున్నప్పుడు, దానిని నమలడానికి, మింగడానికి ప్రయత్నించం. దాన్ని అలాగే పెట్టుకుని చూస్తాం. చాలా సేపటి తర్వాత నోటిలో ఉన్న ఆహారాన్ని మింగుతాం. దీని వల్ల జీర్ణక్రియ సక్రమంగా ఉండదు. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడంతో కడుపునొప్పి, మలబద్ధకం వస్తాయి. మనం తిన్న ప్రతిసారీ ఆహారాన్ని నమిలి మింగడం చాలా ముఖ్యం.

మనం మొబైల్ ఫోన్‌పై దృష్టి పెట్టి.. ఆహారం తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి. ఊబకాయం కనిపిస్తుంది. మధుమేహానికి దారితీస్తుంది. మధుమేహం వంటి జబ్బులకు దూరంగా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ చూస్తూ తినకండి. ఆహారాన్ని నేలపై కూర్చొని, ప్రశాంతంగా రుచిని ఆస్వాదిస్తూ తినాలి. దీని వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. పైగా ఫోన్‌ మీకు కనిపించే అంత క్లీన్‌గా ఏం ఉండదు. దానిపై ఉండే సూక్ష్మక్రిములు టాయిలెట్‌ వాష్‌బేషిన్‌పై కంటే ఎక్కువగా ఉంటాయి. అలాంటిదాన్ని మీరు ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో తింటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news