ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడంతో ఇప్పుడు వైసీపీ మరియు టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఈ సందర్భంగా కొందరు వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు జగన్ మెడకు చుట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి.
ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రమేష్ కుమార్ ని ఉద్దేశించి కనకపు సింహాసనము మీద శునకాన్ని కూర్చోబెట్టారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదేవిధంగా ఆయనకు సిగ్గుంటే రాజీనామా చేయాలి అంటూ వైసీపీ నేతలు కొంతమంది చేసిన వ్యాఖ్యలు వాటిని విజయసాయిరెడ్డి విమర్శించిన తీరు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
వాస్తవానికి రమేష్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎందరో ముఖ్యమంత్రులు దగ్గర పనిచేశారు.అలాంటి వ్యక్తిని పట్టుకుని కుక్క తో పోల్చటం అదేవిధంగా సిగ్గుందా సిగ్గుంటే అంటూ మాట్లాడటం వివాదాస్పదంగా మారాయి. దీనిపై ఆయన పరువు నష్టం దావా వేస్తే వైసీపీ నేతలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా కూడా అధికార పార్టీకి ఇబ్బందే.
2019 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.తర్వాత ఎన్నికల సంఘం అధికారులు మరింత కఠినంగా వ్యవహరించడంతో టీడీపీ అప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొంది అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయితే వైసీపీ నేతలు ఈ విధంగా ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం అనేది ఇబ్బందికర పరిణామమనే చెప్పాలి.