చిరుకి సాయిరెడ్డి కౌంటర్..మధ్యలో బాలయ్యని లాగారా?

-

ఏపీలో మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వేడి రాజుకున్న విషయం తెలిసిందే. బ్రో సినిమాని టార్గెట్ చేసి వైసీపీ నేతలు విమర్శలు చేయడంపై పరోక్షంగా చిరంజీవి స్పందించారు. ఇటీవల రాజ్యసభలో సినీ హీరోల రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉండటంపై విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో ఈ అంశంపై చిరంజీవి స్పందించారు.

రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా, అభివృద్ధి అంశాలపై మాట్లాడకుండా..హీరోల రెమ్యూనరేషన్ గురించి రాజ్యసభలో మాట్లాడటం కరెక్ట్ కాదని చిరంజీవి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో సమస్యలు వదిలేసి సినిమాలపై ఎందుకు పడతారని, పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకని ప్రశ్నించారు. ఇక చిరు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు వరుసగా ఫైర్ అయ్యారు. ప్రతి పకోడీ గాడు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడమే అని కొడాలి నాని..చిరుకు చురకలు అంటించారు. అంబటి, రోజా, గుడివాడ లాంటి వారు చిరుపై ఫైర్ అయ్యారు.

ఇదే క్రమంలో విజయసాయిరెడ్డి కూడా చిరుకు కౌంటర్ ఇచ్చారు. “సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్‌ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది.” అని ట్వీట్ చేశారు.

మరో ట్వీట్‌లో “కొందరు సినిమా హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటూ, వీలయితే ఉచితంగా నటిస్తూ….లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారు. కళామతల్లిపై ప్రేమతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారు. అలాంటి వారికి హాట్సాఫ్.” అని అన్నారు.

BalayyaVijayasai

అయితే బాలయ్య రెమ్యూనరేషన్ తక్కువగానే ఉంటుందని, సినిమా ఫ్లాప్ అయితే.. ఆ నిర్మాతలకు తక్కువకే సినిమాలు చేస్తారనే ప్రచారం ఉంది. ఇక బాలయ్యతో తారకరత్న ద్వారా సాయిరెడ్డికి బంధుత్వం ఉంది. ఈ క్రమంలో పరోక్షంగా బాలయ్యని పొగిడి..చిరుకు సాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారా? అనే చర్చ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news