సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీకి కొన్ని చిక్కులు ఎదురవుతున్నాయి.. తెలుగు తమ్ముళ్లే అధినేతకు తలనొప్పిగా మారుతున్నారు.. ఇంద్రకీలాద్రి చెంతన తెలుగు తమ్ముళ్ల టికెట్ లొల్లి ఎక్కువైంది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అన్నదమ్ముల ఫైట్ తెలుగుదేశం పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.. దానికి తోడు నేతల మధ్య అంతర్గత విభేదాలు అధిష్టానానికి మింగుడు పడనివ్వడం లేదని పార్టీలో చర్చ నడుస్తోంది.. కేశినేని నాని, చిన్ని ల స్ట్రీట్ ఫైట్ పార్టీలోని అంతర్గత విభేదాలను బహిర్గతం చేసింది.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టికెట్లు ఆశిస్తున్న ఆశవాహుల జాబితా పెరిగిపోతూ ఉండడంతో అధినాయకత్వానికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారిందట.. అన్ని నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న వారు ఒకరు ఇద్దరు ఉంటే.. విజయవాడ పశ్చిమంలో మాత్రం నలుగురు అభ్యర్థులు టికెట్ తమకంటే తమకంటూ ప్రకటనలు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే ఆ నాయకుల మధ్య పోటీలు అంతర్గత విభేదాలతో పార్టీ పరువు బజారున పడుతుందని టిడిపి క్యాడర్ ఆందోళనలో ఉంది.. తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా ఉన్న బుద్ధ వెంకన్నకు, ఎంపీ కేశినేని నానికి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సమయంలో.. కేశినేని చిన్ని కూడా ఎంటర్ అయ్యారు.. విజయవాడ పశ్చిమ టికెట్ తనకేనంటూ బుద్ధ వెంకన్న తన అనుచరుల వద్ద చెబుతున్నారట.. తనకు ఈ నియోజకవర్గంలో టికెట్ ఇవ్వకపోతే వేరే చోటైన అవకాశం కల్పించాలని.. లేకపోతే ఏం చేయాలో తనకు తెలుసు అంటూ అంతర్గత సమావేశాల్లో బుద్ధ వెంకన్న చెబుతున్నారట.. మరోపక్క చిన్ని కూడా టికెట్ ఆశిస్తూ ఉండడంతో.. ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో అర్థం కాక అధినాయకత్వం ఆలోచనలో పడ్డదట.. విజయవాడ పశ్చిమ రాజకీయం రంజుగా మారడంతో టికెట్ ఎవరికి వస్తుందా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది