ఫటాఫట్ ధనాధన్ అవినాష్ అంతా మూడు రోజుల్లోనే తేల్చేశాడు. పార్టీ మారతాడని వార్తలు వచ్చాయి. ఇలా టీడీపీకి రాజీనామా చేశాడో లేదో ఆ గంటలోనే జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయాడు. టీడీపీకే చెందిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీలా ఎంత మాత్రం నాన్చలేదు. అవినాష్‌తో పాటు టీడీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు సైతం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక అవినాష్ అనుచరులు సైతం వైసీపీలో చేరిపోయారు.
అవినాష్ వైసీపీలో చేరడానికి గంట ముందు ఏపీ తెలుగు యువత అధ్యక్ష పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను నేరుగా పార్టీ కార్యాలయానికి పంపారు. ఇక అవినాష్ పార్టీ అధినేతకు రాసిన లేఖలో తన ఆవేదన అంతా చెప్పుకున్నారు. తాను పార్టీలో చేరినప్పటి నుంచి అధినేత మాటే తన బాటగా చాలా నిబద్ధతతో పని చేశానన్నారు. అయితే కృష్ణా జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలను వినియోగించుకోవడంలో టీడీపీ విఫలమైందని పేర్కొన్నారు.
ఇక ఎన్నికల్లో తనకు అనువైన స్థానం కాకపోయినా గుడివాడ నుంచి పోటీ చేశానని… ఓడిపోయినా పార్టీ కోసం ముందంజ వేసినా పార్టీలో ప్రయార్టీ లేకపోవడం ఎంతో బాధ కలిగించిందని కూడా చెప్పాడు. ఇక అవినాష్ తన లేఖలో కొందరు స్థానిక నేతలే తన ఎదుగుదల చూసి ఓర్వలేకే ఇదంతా చేస్తున్నా… అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇక అవినాష్ లేఖలో నేరుగా పేర్లు చెప్పకపోయినా చివరకు తన సొంత బాబాయ్ దేవినేని ఉమా సైతం తనను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించాడని.. ఆయన కూడా తన రాజకీయ ఎదుగుదలకు తాను అడ్డు వస్తానన్నట్టుగా వ్యవహరించాడని కూడా అవినాష్ సన్నిహితుల వద్ద వాపోయాడట. అదే టైంలో అటు విజయవాడ తూర్పులో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పెట్టిన ఇబ్బందులు, ఇటు ఓవర్ టేక్ అవుతున్నావంటూ లోకేష్ గుచ్చేలా చేసిన కామెంట్లు కూడా అవినాష్‌ను ఎంతో బాధ పెట్టాయని టాక్.