TSRTC ప్రభుత్వంపై కస్సు బుస్సులాడుతోంది. దాదాపు 26 డిమాండ్లను పరిష్కరించాలనే డిమాండ్‌తో రాష్ట్రంలోని 97 డిపోల డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మిక వర్గాలు విధులను బహిష్కరించాలని నిర్ణయించాయి. అన్ని డిపోలు, యూనిట్లలో కార్మికులు సమ్మెలో పాల్గొని, ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లకుండా చూడాలని కార్మిక నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగి వచ్చేదాకా సమ్మెను నిరవధికంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. ఆదిలో ఈ విషయంపై సానుకూలంగానే స్పందించిన కేసీఆర్.. ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని నియమించారు. ఆయా సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.
అయితే, వేతనాల పెంపు వంటి కీలక నిర్ణయంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని నివేదికసిద్ధ మవుతున్న సమయంలో కార్మిక సంఘాలు తమ డిమాండ్లను మరింత పెంచాయి. ఈ క్రమంలోనే అత్యంత రద్దీ సమయం అయిన దసరా ఉత్సవాల సమయంలో సమ్మెకు దిగాలని నిర్ణయించాయి. అదేసమయంలో కేసీఆర్ ఢిల్లీలో ఉండడం, రాష్ట్రంలో ఆర్టీసి కార్మికులు సమ్మెకు దిగాలని పిలుపుని వ్వడం, దీనికి రాజకీయ పక్షాలు కూడా జత కలవడంతో కేసీఆర్ ఒక్కసారిగా ఆగ్రహోదగ్రు లయ్యారు. ఆర్టీసీ అత్యవసర సేవల కిందకు వస్తుందని, ఈ దృష్ట్యా ఎస్మా అమల్లో ఉందని తెలిపారు. అయినా, సమ్మెకు దిగితే వారిని డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. ఆ వెంటనే ఐఏఎస్ కమిటీని రద్దు చేశారు.
శుక్రవారం రాత్రికి రాత్రి ఉన్నతాధికారులతో భేటీ అయి.. సమ్మెను పక్కనపెట్టాలని, లేకుండా ఏకంగా ఉద్యోగాల్లోంచే తొలగిస్తామన్నారు. ఆర్టీసీలో ప్రస్తుతం 10 వేలకు పైగా బస్సులున్నాయని, సమ్మె కార ణం గా ఇవి నిలిచిపోతే… అంతే స్థాయిలో 10 వేల బస్సులను నడపడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలి పారు. దీంతో కార్మికులు మరింతగా రెచ్చిపోయారు. ఇకపై వారితో చర్చలు ఉండవని తేల్చేసింది. శని వారం సాయంత్రం 6 గంటల్లోపు ఆర్టీసీ డిపోల్లో విధుల్లో చేరిన వారిని మాత్రమే ఇకపై ఆర్టీసీ ఉద్యోగు లుగా గుర్తించాలని నిర్ణయించింది. అప్పటికి విధుల్లో చేరని వారిని తమంతట తాముగా ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్లిన వారిగా గుర్తించాలని ప్రభుత్వం నిశ్చయించింది.
విధుల్లో చేరని వారిని ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగంలో చేర్చుకోరాదని ప్రభుత్వం విధాన నిర్ణ యం తీసుకుంది. విధుల్లో చేరి, బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్మికులకు పూర్తిస్థాయిలో రక్షణ, ఉద్యోగ భద్ర త కల్పిస్తామని స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మె విషయంలో కఠినంగానే వ్యవహరించాలని, క్రమశిక్షణ కాపా డాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ఇక,ఇప్పుడు తాజాగా శనివారం సాయంత్రం 6లోగా విధుల్లో చేరకపోతే.. ఉద్యోగాలు కోల్పోయినట్టేనని ఆర్టీసీ మంత్రిగా ఇటీవలే ప్రమాణం చేసిన పువ్వాడ అజయ్ ప్రకటించారు. కట్ చేస్తే. ఇప్పుడు ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుంది.
అటు కార్మికుల పట్టు.. ప్రభుత్వం బెట్టు.. వెరసి ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. మరోపక్క, దీనిపై హైకోర్టుకు వెళ్లే యోచనలో ప్రజాసంఘాలు ఉన్నాయి. ఇదే జరిగితే.. గత పరిణామాలను గమనిస్తే.. ప్రభుత్వమే బోనులో ఇరుక్కోవాల్సి వచ్చింది. కార్మికుల పక్షానే కోర్టులు తీర్పులు చెప్పాయి. ఎలా చూసినా.. మధ్యేమార్గంగా కేసీఆర్ ఈ విషయంలో చతురత చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే పండగ పూట ప్రబుత్వం అభాసుపాలు కాక తప్పదని అంటున్నారు పరిశీలకులు.