జమిలి ఎన్నికలు ఎప్పుడు ఉండొచ్చు…!

-

భారత్ లో జమిలి ఎన్నికల నిర్వహణ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోద ముద్ర వేసింది.తమ హయాంలోనే జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పేశారు. దీంతో వచ్చే ఐదేళ్లలోపే మధ్యంతర ఎన్నికలు తప్పవని తేలిపోయింది. అయితే ఈ జమిలి ఎన్నికలు దాదాపుగా ఎప్పుడు ఉండొచ్చన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే జమిలి కోసం కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకూ జమిలి ఎన్నికలు అవసరమా లేదా,వీటి వల్ల లాభనష్టాలు ఏంటి అనే దానిపై కసరత్తు జరిగింది.

ఫైనల్ గా కేంద్ర కేబినెట్ ఆమోదంతో జమిలి ఎన్నికల నిర్వహణ తప్పదని తేలిపోయింది.అయితే ఇప్పుడు జమిలి ఎన్నికలు ఎప్పుుడు పెట్టాలన్న దానిపై కసరత్తు జరగాల్సి ఉంది. దీనికోసం ముందుగా పార్లమెంట్ లో మూడింట రెండొంతుల మెజార్టీతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలి. ఇది జరిగిపోతే ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్ర, ఎన్నికల షెడ్యూల్స్ ఖరారు వంటి చర్యలు వేగవంతమవుతాయి.

పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ బిల్లు, దానికి రాష్ట్రపతి ఆమోదం కూడా కష్టం కాకపోవచ్చు. అసలు విషయం ఏమిటంటే జమిలి ఎన్నికల కోసం ఎన్నో కొన్ని అసెంబ్లీల పదవీకాలం పొడిగించడం, మరికొన్ని అసెంబ్లీల పదవీకాలం తగ్గించాల్సి ఉంటుంది. అయితే వీటి సంఖ్య ఎంత తక్కువ ఉంటే అన్ని సమస్యలు తగ్గుతాయి. కాబట్టి వీటి ఆధారంగా పరిశీలిస్తే జమిలి ఎన్నికలు ఎప్పుడు ఉండొచ్చన్న దానిపై క్లారిటీ వస్తుంది.

2027లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీల పదవీకాలం ముగుస్తుంది. వాటికి తక్షణమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే 2028 ఫిబ్రవరి-మే మధ్య కర్నాటక, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు నవంబర్లో తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్దాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం పూర్తవుతుంది. వాటికి కూడా ఎన్నికలు జరపాలి.

ఇక 2029లో ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూకశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీల పదవీకాలం ముగుస్తుంది.సార్వత్రిక ఎన్నికల సమయం కాబట్టి ఈ రాష్ట్రాలకు ముందస్తు అవసరం లేదు.కాబట్టి ఈ రాష్ట్రాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు.దీనిని బట్టి చూస్తే 2027 నుంచి 2029 మధ్య ఏకంగా 24 రాష్ట్రాల ఎన్నికలు ఉంటాయి. 2029లో సార్వత్రిక ఎన్నికలు కూడా ఉంటాయి. 2027 నుంచి 2028 మధ్య అయితే 16 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి.

కాబట్టి 2029లో జరగాల్సిన 8 రాష్ట్రాల ఎన్నికలను, లోక్ సభ ఎన్నికలను ముందుకు జరిపితే 2028లో జమిలి ఎన్నికలు పెట్టేయొచ్చు. దీని వల్ల 2027లో ఎన్నికలు పెండింగ్ ఉన్న 7 రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం పొడిగించాల్సి ఉంటుంది. వీటిలో హిమాచల్, పంజాబ్ మినహా మిగిలిన చోట్ల బీజేపీయే అధికారంలో ఉంది. కాబట్టి ఈ 7 రాష్ట్రాల అసెంబ్లీ గడువు పొడిగింపు బీజేపీకి పెద్ద సమస్య కాదు.అదే జరిగితే 2028లో జమిలి నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయినట్లే.

Read more RELATED
Recommended to you

Latest news