ఎస్‌ కోటలో పాగా వేసేదేవరో

-

విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోట నియోజకవర్గం రాజకీయంగా ప్రాధాన్యం కలిగిన ప్రాంతం. తొలినాళ్లలోనే ఇక్కడ ఎన్నికలు జరిగాయి.1951 మొదలుకుని ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి 18సార్లు ఎన్నికలు జరిగాయి.ఏడుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, ఐదుసార్లు కాంగ్రెస్‌ పార్టీ,ఒక్కసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. నియోజకవర్గంలో ప్రస్తుతం 2,50,429 మంది ఓటర్లు ఉండగా1,22,036 మంది పురుష ఓటర్లు, 1,28,362 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ అభ్యర్థిల గెలుపోటములను మహిళలే నిర్ణయిస్తుంటారు.

1952లో తొలిసారి ఇక్కడ ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నికల్లో సోషలిస్టు పార్టీకి చెందిన సీవీ సోమయాజులు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన వెంకటరామయ్యపై 11,688 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక 1953లో జరిగిన ఉప ఎన్నికల్లో పీఎస్సీ నుంచి పోటీ చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు ఏకగ్రీవంగా ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. 1955లో జరిగిన ద్విసభ ఎన్నికల్లో పీఎస్సీ నుంచి పోటీ చేసిన సీవీ సోమయాజులు మరోసారి విజయం సాధించారు.

ఇదే ఏడాది జరిగిన జరిగిన ఎన్నికల్లో పీఎస్సీ నుంచి పోటీ చేసిన జీఆర్‌ నాయుడు విజయాన్ని సాధించారు.1960లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన జీడీ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1962లో జరిగిన ఎన్నికల్లో జీడీ నాయుడు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి మరోసారి ఎన్నికయ్యారు.1967లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కె అప్పలనాయుడు ఇక్కడ విజయం సాధించారు.1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కేవీఆర్‌పీఎస్‌పీ రాజు విజయం సాధించారు. 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన డి సన్యాసిదొర ఇక్కడి నుంచి గెలుపొందారు.

1983 నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కొనసాగింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎల్‌బీ దుక్కు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన జి దొరపై 27,185 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1985లో కూడా టీడీపీ నుంచి ఎల్‌బీ దుక్కు విజయం సాధించారు. ఈ రెండుసార్లు తన ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన జి దొర కావడం విశేషం.1989లో జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ నుంచి పోటీ చేసిన ఎల్‌బీ దుక్కు మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు.తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎస్‌ రామచంద్రరరావుపై ఆయన గెలిచారు.1994లో తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో నిలిచిన దుక్కు లబుడు కాంగ్రెస్ అభ్యర్థి గంగాధర స్వామిపై గెలిచారు.

1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన శోభా హైమావతి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన గంగాధరస్వామి శెట్టిపై 678 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. వరుసగా 5సార్లు టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. అయితే 2004లో వైఎస్సార్ పాదయాత్ర ఇక్కడ టీడీపీ వరుస విజయాలకు బ్రేక్ వేసింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కుంభా రవిబాబు టీడీపీ అభ్యర్థి శోభాహైమావతిపై 5802 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కోళ్ల లలిత కుమారి ఇక్కడ విజయం సాధించారు.2014 ఎన్నికల్లోనూ మరోసారి టీడీపీ నుంచి పోటీ చేసిన కోళ్ల లలిత కుమారి గెలుపొందారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీ అభ్యర్థి కె శ్రీనివాస్‌ ఇక్కడ ఓటమిచెందారు.అయితే మళ్లీ అతనికే వైసీపీ టికెట్ కేటాయించడంతో 2019ఎన్నికల్లో కె శ్రీనివాసరావు టీడీపీ లలితకుమారిపై విజయం సాధించారు.

రానున్న ఎన్నికలు శృంగవరపు కోటలో ఆసక్తిని రేపుతున్నాయి. టీడీపీ నుంచి మరోసారి పోటీ చేసేందుకు కోళ్ల లలిత కుమారి సిద్ధమయ్యారు. మరో ఇద్దరు అభ్యర్థులు కూడా టీడీపీ టికెట్‌ కోసం ప్రయత్నాల్లో ఉన్నారు.దీంతో టీడీపీ గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు ప్రచారాలు చేసుకుంటూ కేడర్ ను ఆందోళనలో పడేస్తున్నారు. వైసీపీ తరపున సిటింగ్‌ ఎమ్మెల్యే మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. టీడీపీలో టికెట్ ఎవరికి ఇచ్చినా వైసీపీ అభ్యర్థి శ్రీనివాసరావు మళ్లీ గెలుస్తారని అంటున్నారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు వైసీపీ ని గెలిపిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news