జ్ఞానం ఎవరిది
ఆత్మజ్ఞానం ఎవరిది
మర్యాద పాటింపు ఎవరిది
మన్నన పొందేది ఎవరి నుంచి..
ఇవే ఇవాళ వినిపిస్తున్న ప్రశ్నలు
రాజకీయంలో ఏమయినా జరగవచ్చు. ఏదయినా జరిగినా కూడా మనం ఆశ్చర్యం పొందడం కన్నా ఆరా తీయడం మేలు. రాజకీయాల్లో నిన్నటి పరిణామాలు ఇవాళ ఉండవు కదా! ఆ విధంగా ఆత్మకూరు రాజకీయం మరో మలుపు తీసుకోనుంది. సహజంగా నెల్లూరు రెడ్లు జగన్ మాట వినరు అనే మాట ఉంది. ఇప్పుడదే జరగనుంది. సింపుల్-గా తేలిపోవాల్సిన బై ఎలక్షన్ ఇప్పుడు మరింత జఠిలం కానుంది. తెలుగుదేశం పార్టీ తరఫున నిన్నటి దాకా అభ్యర్థే లేరు కానీ ఇప్పుడు కొత్త ముఖం తెరపైకి వచ్చి, సరికొత్త చర్చకు తావిస్తోంది. అంటే ఆత్మకూరు బై పోల్ కూడా జగన్ కు అంత ఈజీ కాదు అని తేలిపోయింది. ఇప్పుడిక పార్టీలు తమ తమ బలాబలాలను తేల్చుకోవాల్సిందే అన్నమాట! అన్న మాట కాదు ఉన్న మాటే !
రెండు రాజకీయ పార్టీల మధ్య వైరం నడుస్తోంది. యుద్ధం నడుస్తోంది. ఓ విధంగా మేకపాటి కుటుంబం మాత్రం రెండు పార్టీలతోనూ ఎప్పటి నుంచో సఖ్యతతోనే ఉంది. ఆ విధంగా టీడీపీకి, ఆ విధంగా వైసీపీకి దగ్గరగా ఉంది. (అంతకు ముందు కాంగ్రెస్-తో కూడా )…నెల్లూరు రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేసే మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబం అందరితోనూ సఖ్యతగానే ఉంటుంది.పారిశ్రామిక సంబంధాల రీత్యా కావొచ్చు. వ్యాపార సంబంధాల రీత్యా కావొచ్చు. తాజాగా ఆ ఇంట మరో తేజం రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారు. మేకపాటి విక్రం రెడ్డి సీన్లోకి రానున్నారు. త్వరలో జరగనున్న ఆత్మకూరు బై ఎలక్షన్లో పోటీ చేయనున్నారు.
వాస్తవానికి మంత్రి గౌతమ్ రెడ్డి మరణం తరువాత ఇక్కడ సంప్రదాయం అనుసరించి పోటీకి అభ్యర్థిని నిలబెట్టరనే వాదనే మొన్నటి దాకా వినిపించింది టీడీపీ విషయమై ! కానీ ఇప్పుడు రాజకీయంలో భాగంగా ఆనం రాం నారాయణ రెడ్డి కూతురు కైవల్యా రెడ్డి టీడీపీలోకి వెళ్లనున్నారు. అటుపై ఆమె ఆత్మ కూరు బై ఎలక్షన్లో అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. తండ్రి వైసీపీ ఎమ్మెల్యేగా సుపరిచితులు. కానీ ఆమె మాత్రం టీడీపీ గూటికి చేరుకుని రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా బరిలో ఉండడంతో ఇక్కడ పోరు త్రిముఖం అయింది.