కాంగ్రెస్‌లోకి నెక్స్ట్ అత‌నే…సిగ్న‌ల్ ఇచ్చేశారుగా

-

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్నార‌నే ప్రచారం తెలంగాణ‌లో జోరుగా వినిపిస్తోంది. కారు దిగేస్తున్న ఎమ్మెల్యేల సరసన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తహతహ లాడుతున్నట్లు స‌యాచారం. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బోథ్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచారాయ‌న‌. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో అనిల్ త‌ల‌మున‌క‌లైఉన్నారు. గత కొంతకాలంగా ఆయ‌న గులాబి పార్టీని వీడుతార‌నే ప్ర‌చారం జరుగుతున్నా… ఇప్పుడు ఆ ప్రచారం నిజమని నమ్మాల్సి వస్తోందంటున్నారు విశ్లేష‌కులు.

రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వ్యవహరించిన తీరు…ఆ ప్ర‌చారాన్ని బ‌ల‌ప‌రుస్తున్నాయి. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పరిధిలోని పిప్రి గామంలో పర్యటించారు. ఈ సభలో కాంగ్రెస్ నేతలతో పోటీపడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్ర‌భుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేలా ప్ర‌సంగించారు. ఈ ప్ర‌సంగంతో అనేక ఊహాగానాలు తెరలేపింది. డిప్యూటీ సీఎం ఆశీస్సులు ఉండాలనే స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేయడమే పొటిలికల్ సర్కిల్స్‌లో హాట్ డిబేట్‌కు తెరలేపింది.

ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు కాంగ్రెస్ పార్టీతో పాటు.. ఆ పార్టీలోని కొందరు నేతలతో విడదీయరాని అనుబంధం ఉంది. 2004లో తెలంగాణ ఉద్యమ సమయంలో టి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనిల్ జాదవ్ పనిచేశారు. అనంతరం టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2009, 2014 ఎన్నికల్లో బోథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2018లో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల అనంతరం 2019లో మళ్లీ టీ.ఆర్.ఎస్ గూటికి చేరి నేరడిగొండ జడ్పీటీసీగా విజయం సాధించారు.

ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు అనిల్ జాదవ్. అయితే ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజ‌కీయ‌ పరిణామాలు మారిపోయాయి. బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క‌రుగా చేరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు ఆసిఫాబాద్ నుండి గెలుపొందిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ కూడా పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జర‌గ్గా ఇప్పుడు అనిల్ జాదవ్ వ్యవహారశైలిని చూస్తే నెక్ట్స్ లిస్టులో ఉన్నది ఆయనే అన్నది విశ్లేష‌కులు చెప్తున్న మాట‌.

విపక్షానికి చెందిన ఎమ్మెల్యే డిప్యూటీ సిఎం భట్టిని తెగ పొగిడేయడం వెనుక రీజనేంటి? అని తెగ ఆశ్చ‌ర్య‌పోయార‌ట చూసిన‌వారంతా. అటు కాంగ్రెస్ నేత‌లు సైతం ఎమ్మెల్యే అనిల్ వైఖ‌రితో జుట్టుపీకేసుకున్నార‌ట‌. తాను మాత్రం గాంధీబభ‌వ‌న్ వైపు వెళ్తాన‌నే సిగ్న‌ల్ ఇచ్చేశారు అనిల్‌. విదేశీ ప‌ర్య‌ట‌న నుంచి ముఖ్య‌మంత్రి తిరిగి వ‌చ్చేశాక ఆయ‌న స‌మ‌క్షంలో కాంగ్రెస్ కండువా క‌ప్పుకునేందుకు అనిల్ సిద్ద‌మ‌వుతున్నారని టాక్ న‌డుస్తోంది.

ఈలోపు డిప్యూటీ సీఎం భ‌ట్టీ విక్ర‌మార్క లైన్ క్లియ‌ర్ చేస్తార‌ని అంటున్నారు.  స్థానిక కాంగ్రెస్ నేత‌లు వ్య‌తిరేకిస్తున్నా ఆయ‌న్ని చేర్చుకునేందుకు కాంగ్రెస్ పెద్ద‌లు సిద్ధ‌మైపోయారు. మ‌రి రేంవ‌త్ వ‌చ్చాక ప‌రిస్థితి ఏంట‌న్న‌ది వేచి చూడాలి. మొత్తానికి బీఆర్ఎస్ నుంచి 11వ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news