గోదావరి, కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో నమోదు అవుతున్న వర్షపాతాలను దృష్టిలో పెట్టుకొని జలవిద్యుత్ కేంద్రాల్లో గరిష్ట ఉత్పత్తిని సాధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని హైడల్ ప్రాజెక్టుల సీఈలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. తాజాగా ఆయన మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో థర్మల్, హైడల్ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రతీ ప్లాంట్ లో కనీసం 17 రోజులు విద్యుత్ ఉత్పాదనకు సరిపడే బొగ్గు నిలువలు అందుబాటులో ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మనమంతా నిబద్ధతతో, మనస్సు పెట్టి పని చేయాలని, నిర్లక్ష్యానికి, అలసత్వానికి, ఆలస్యానికి తావు లేదని తెలిపారు. విద్యుత్ శాఖలో పని చేయడమంటే.. ప్రజల కోసం నిరంతరం పని చేయడమే అన్నారు. విద్యుత్ శాఖ అంటేనే 24/7 పని చేసే అత్యవసర శాఖ అని అదికారులు, సిబ్బంది గుర్తుంచుకోవాలని సూచించారు. ఎవ్వరికైనా సమస్యలుంటే విని వాటిని పరిష్కరించేందుకు 24 గంటల పాటు తాను అందుబాటులో ఉంటానని సిబ్బందికి భరోసా ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.