ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది వైసీపీ నాయకుల మధ్య ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలోని బద్వేల్ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు బహిర్గతమయింది. బద్వేల్ ఎస్సీ రిజర్వుడు స్థానం. ఇక్కడ దాసరి సుధ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్నారు. కానీ బద్వేల్ లో అభ్యర్థి ఎవరో నిర్ణయించే దగ్గర నుంచి, గెలుపు తర్వాత పరిపాలన అంతా కూడా జగన్ సామాజిక వర్గం వారే చేస్తారని బహిరంగ రహస్యం.
బద్వేల్ నియోజకవర్గం ఇన్చార్జిగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి సొంత కుటుంబం నుంచే అసమ్మతి సెగలు తగులుతున్నాయి. గోవిందరెడ్డి తమ్ముడైన సత్యనారాయణరెడ్డి బావ విశ్వనాథరెడ్డి తో కలిసి ఏడు మండలాలలోని వైసిపి నేతలను కలుపుకొని అసమ్మతి గళం వినిపిస్తున్నారు.
ఎమ్మెల్సీ గోవిందరెడ్డితో కలిసి పనిచేయమని బహిరంగంగా చెప్పడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ గోవిందరెడ్డి వైఖరితో నేతలు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని సత్యనారాయణ రెడ్డి పోరుమామిళ్లల్లో ఏర్పాటు చేసిన అసమ్మతి సమావేశంలో బహిరంగంగానే చెప్పటంతో గోవింద రెడ్డిపై ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్థం అవుతుంది. పార్టీ క్యాడర్ ను పట్టించుకోకుండా గోవింద్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, ఆయన ఒంటెద్దు పోకడల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటికైనా బద్వేల్ వైసీపీలో వర్గ పోరును సరిదిద్దకపోతే వచ్చే ఎన్నికల్లో భారీ నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాకపోతే వైసీపీ క్యాడర్ బలంగా ఉండటం, జగన్ ఇమేజ్ వల్ల బద్వేలులో వైసీపీ నుంచి ఎవరు నిలబడిన గెలిచే అవకాశాలు ఉన్నాయి.