తెలంగాణ సాధించుకున్న తర్వాత జరుగుతున్న మూడవ ఎన్నికలు. ఇప్పటికి రెండుసార్లు తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. కానీ యువతను మాత్రం పట్టించుకోలేదని మాట వాస్తవం. అసలు తెలంగాణ ఉద్యమం మొదలయ్యిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం. వీటిలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతోందనే కారణంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అందుకే తెలంగాణ ఉద్యమంలో యువత ముఖ్య పాత్ర పోషించిందని చెప్పవచ్చు. యువత బలిదానాలతో సాధించిన తెలంగాణలో నిరుద్యోగులకు నిరాసే మిగిలింది అన్నది నూటికి నూరు శాతం నిజం. ప్రత్యేక తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని యువత అంతా ఆశపడ్డారు కానీ నిరాశే ఎదురైందని చెప్పవచ్చు.
తెలంగాణ ఉద్యమంలో మిగిలిన రాజకీయ పార్టీలు కూడా పోరాడిన యువత మాత్రం బిఆర్ఎస్ కు అండగా నిలిచింది. బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే భవిష్యత్తు బాగుంటుందని అందరితో ఓట్లు వేయించారు, కానీ 10 సంవత్సరాలలో నిరుద్యోగ యువతకు నిరాశే మిగిల్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం. ఉద్యోగాలు వస్తాయని యువత అంతా రెండుసార్లు కారు వైపే చూశారు, కానీ నిరాశ తప్పలేదు.
ఈసారి భారీగా పెరిగిన కొత్త ఓట్లతో ఏ పార్టీకి లాభం చేకూరనుందో?? బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి త్రిముఖ పోటీలో నేతలందరికీ కొత్త ఓటర్లు నిద్రను దూరం చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ పది సంవత్సరాలలో నిరుద్యోగ యువతకు నిరాశ మిగిలింది. నిరుద్యోగ యువతతో పాటు కొత్తగా చేరిన ఓటర్లు కూడా బిఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చే పార్టీని నిర్ణయించేది యువతే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మరి ఈసారి యువత ఓట్లు ఏ పార్టీ వైపో??