వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారనే ప్రచారం నేపధ్యంలో.. సోనియాతో సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీలో సోనియా నివాసంలో బ్రేక్ ఫాస్ట్ భేటీలో దాదాపు గంటన్నర పాటు వీరి మధ్య చర్చలు జరిగాయి. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే వచ్చే లాభాలు, హామీలు, ప్రాధాన్యతల నేపధ్యంలోనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.
ఏపీలో షర్మిల అన్న, సీఎం జగన్మోహన్ రెడ్డికి పోటీగా బరిలోకి దించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. మరోవైపు తెలంగాణలో షర్మిలను ఎలా వినియోగించుకుంటే మంచిదనే యోచనలో కూడా ఉంది. పార్టీ మొదలుపెట్టిన నాటి నుంచే షర్మిల బీఆర్ఎస్ ప్రభుత్వంపై గట్టి పోరాటమే సాగిస్తోంది. ఈ క్రమంలోనే షర్మిలను తమ వైపు తిప్పుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎంతోకొంత లాభదాయకమనే కాంగ్రెస్ ఆలోచనగా ఉంది. షర్మిల కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతోంది. గతంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్ తో షర్మిల భేటీ అయ్యారు. నాటి నుంచే ఆమె కాంగ్రెస్ పార్టీకి సానుకూల సంకేతాలు పంపుతున్నట్లు వార్తలొచ్చాయి. కాగా నేడు సోనియా, రాహుల్ తో షర్మిల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో మలుపు తిప్పబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ భేటీ అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. సోనియా, రాహుల్ గాంధీ తో మంచి సమావేశం జరిగిందని, నిర్మాణాత్మక చర్చలు జరిగాయని స్పష్టం చేశారు. తెలంగాణకు సంబంధించిన రాజకీయ అంశాలపై తమ మధ్య చర్చ జరిగిందన్నారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా రాజశేఖర్ బిడ్డ నిరంతరం పని చేస్తుందని వెల్లడించారు. కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని హెచ్చరించారు.