జూన్9వ తేదీన సీఎంగా రెండోసారి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు సరే…ఇంతకీ జగన్ కేబినెట్‌లో ఎవరు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఏకంగా పేర్లు కూడా వినిపిస్తున్నాయి.ఈ ఎన్నికల్లో 151 కంటే ఎక్కువ స్థానాలను గెలుపొందుతామని సీఎం జగన్ ధీమాతో ఉండగా అటు ఐ-ప్యాక్ కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసింది.దీంతో సీఎం కేబినెట్‌లో చేరేందుకు చాలా మంది ఆశావహులు సిద్ధమవుతున్నారు.
గెలిస్తే తప్పకుండా జగనన్న మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తున్నాయి.ఈ మేరకు రీజినల్ కోఆర్డినేటర్‌లకు వినతులు వస్తున్నాయి. ఒక్కో జిల్లా నుంచి 5 కంటే ఎక్కువ మందే ఈసారి జగన్ కేబినెట్‌లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. జూన్ 9వ తేదీన సీఎం ప్రమాణం ఉంటుందని చెప్పడంతో కేబినెట్‌లో బెర్త్ దక్కించుకునే ఆశావహుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.
పిఠాపురం నుంచి పవన్‌కళ్యాణ్‌పై పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధి వంగా గీత గెలిస్తే ఆమెకు డిప్యూటీ సీఎం పదవి దక్కనుంది.ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం జగన్ స్వయంగా ఆమె పేరును ప్రకటించారు కూడా. ఒకవేళ వంగా గీత ఓడిపోయినప్పటికీ వైసీపీ అధికారంలోకి వస్తే ఆమెకు జగన్ కేబినెట్‌లో బెర్త్ కన్ఫర్మ్ అనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. వంగా గీతను ఎమ్మెల్సీ చేసి డిప్యూటీ సీఎం పీఠంపై కూర్చోబెట్టడం ఖాయంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
సామాజిక వర్గాల వారీగా తొలుత ఆమెకే ప్రాధాన్యం కల్పిస్తారని వైసీపీ నేతలు చెప్తున్న మాట. మంత్రి పదవి కట్టబెట్టి పిఠాపురం నియోజకవర్గంలో గట్టి నాయకురాలిగా పవన్ కల్యాణ్‌ను ధీటుగా ఎదుర్కొనే నాయకురాలిగా వంగా గీతను తయారు చేసేలా సీఎం జగన్ ప్లాన్ వేశారని తెలుస్తోంది. అటు కుప్పం బరిలో ఉన్న భరత్ కూడా చంద్రబాబుపై గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని సీఎం ఇదివరకే ప్రకటించారు. చంద్రబాబుకి ధీటుగా భరత్‌ని తయారు చేయాలన్నది సీఎం జగన్ ప్లాన్.
దీనికి మంత్రి పెద్దిరెడ్డి కూడా కృషి చేస్తున్నారు. సీఎం కేబినెట్‌లో ఖచ్చితంగా చోటు ఉండేవారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ పేర్లు ముందువరుసలో ఉన్నట్లు వినిపిస్తున్నాయి. రాయలసీమలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఉత్తరాంధ్రలో కీలకనేతగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణకు మళ్ళీ కేబినెట్‌లో చోటు ఉంటుందని తెలుస్తోంది.
ప్రతిపక్షనేతలపై తీవ్రంగా విరుచుకుపడే వారికి ఈసారి ఖచ్చితంగా బెర్త్ దక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి వారిలో కొడాలి నాని, పేర్నినాని ముందువరుసలో ఉన్నారు.వైసీపీలో వీరిద్దరూ బలమైన గొంతుకలుగా చెప్తుంటారు. వైసీపీపైనా వైఎస్ జగన్‌పై ఎవరు విమర్శలు చేసినా తట్టుకోలేరు. తమ నోటికి పదును చెప్పి అవతలి వ్యక్తులు ఎంతటిపెద్దవారైనా సరే వదిలిపెట్టకుండా ప్రతిదాడికి దిగడం వీరి ప్రత్యేకత.ఒకవేళ గుడివాడలో కొడాలి నాని ఓడిపోయినప్పటికీ ఆయనను ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ గా తీసుకుంటారు అని ప్రచారం. బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని వైసీపీ వాయిస్ బలంగా వినిపించడం మాత్రమేకాదు. చంద్రబాబు, నారా లోకేశ్‌తోపాటు ఇతర టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడుపై పోటీ చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్ గెలిస్తే ఆయనకు కూడా కేబినెట్‌లో చోటు ఉంటుంది. ఉమ్మడి విజయనగరం నుంచి పీడిక రాజన్నదొర,ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి కరణం ధర్మశ్రీ, తూర్పుగోదావరి జిల్లా నుంచి పిల్లి సూర్యప్రకాశ్,తోట త్రీమూర్తులు, వెస్ట్ గోదావరి నుంచి అబ్బయ్య చౌదరి, గుంటూరు నుంచి మురుగుడు లావణ్య,విడదల రజని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు జిల్లా నుంచి మేకపాటి విక్రమ్‌రెడ్డి లేదా ఖలీల్ అహ్మద్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి.