పాదయాత్ర లు చేసిన జగన్ పర్యటనలకు భయపడుతున్నారా ?

మండుటెండను సైతం లెక్కచేయకుండా రాష్ట్రమంతా పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు పడుతున్న కష్టాలు ఇబ్బందులు అన్నిటిని జగన్ స్వయంగా చూశారు. ఎవరు ఏ విషయం భయపడనవసరం లేదని, తాను ఉన్నానని ప్రకటించడమే కాకుండా,  అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసి చూపించింది. ఒక రకంగా జగన్ అధికారంలోకి 151 సీట్లు తిరుగులేని మెజారిటీ సంపాదించారు అంటే ఖచ్చితంగా అది జగన్ పాదయాత్ర మహిమే. పాదయాత్ర ద్వారా ప్రజల లో మమేకం అవ్వగలిగారు. అయితే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ ఈ స్థాయిలో పర్యటనలు చేయకపోవడం, ఎక్కువగా తన కార్యాలయం నుంచి విధులు నిర్వర్తిస్తూ,  మొత్తం అధికారుల ద్వారా అన్ని వ్యవహారాలను నడిపిస్తూ వస్తున్నారు. అక్కడి నుంచే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
అయితే జగన్ జిల్లాల పర్యటనకు వెళ్లకపోవడం, పెద్దగా జనాల్లో తిరిగేందుకు ఆసక్తి చూపించకపోవడం వంటివి వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారడంతో పాటు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ఇది మంచి అడ్వాంటేజ్ గా కనిపిస్తోంది. కరోనా సమయంలో బాబు, లోకేష్ వంటివారు జిల్లాలలో పర్యటించి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. లోకేష్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి , ప్రభుత్వంపై విమర్శలు చేశారు.అయినా, జగన్ జిల్లాల పర్యటనకు రావడం మానేశారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం ఎక్కువగా ఉందని, అది బయటపడుతుందని జగన్ జనంలోకి రావడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా, జగన్ మాత్రం బయటకు వచ్చేందుకు పెద్దగా ఇష్ట పడడం లేదు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నిరంతరం జనంలోనే ఉంటూ, జగన్ జన బలం పెంచుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆ పరిస్థితి మార్చుకోవడం, వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.
ఈనెల నాలుగో తేదీన పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వివాహానికి హాజరయ్యే నిమిత్తం ఏలూరు వెళ్లారు. ఆ సందర్భంగా అక్కడే కొన్ని శంకుస్థాపన లు చేశారు తప్ప , పూర్తిగా అధికారిక కార్యక్రమం ఏర్పాటు చూసుకోలేదు. ఈ పర్యటనకు గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో భద్రతను ఏర్పాటు చేయడం చూస్తుంటే , నిజంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా జనాల్లోకి వచ్చేందుకు జగన్ భయపడుతున్నారనే సందేహాలు ఎన్నో వస్తున్నాయి.
-Surya